క్షీరసాగర మథనం గురించి అనేక కథలు హిందూ మతంలోని అనేక పురాణ గ్రంథాలలో కనిపిస్తాయి. క్షీరసాగర మధనం గురించి విష్ణు పురాణంలో వివరంగా ప్రస్తావించబడింది. తనని వదిలి తండ్రి అయిన సముద్రుడి ఒడిలోకి చేరుకున్న లక్ష్మీదేవి తిరిగి వచ్చేందుకు అమృతం కోసం విష్ణువు ఆజ్ఞ మేరకు, దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని అంటే క్షీర సాగరాన్ని మథించారు. ఈ మథనం సమయంలో లక్ష్మీదేవి సహా 14 విలువైన రత్నాలు లభించాయి. మొదట విషం జన్మించగా.. చివరగా అమృతం ఉద్భవించింది. ఈ రోజు క్షీర సాగర మథనం సమయంలో దేవదానవులు పొందిన 14 విలువైన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
సముద్ర అల్లకల్లోలం ఎందుకు జరిగింది?
దుర్వాస మహర్షి శాపం కారణంగా స్వర్గం సంపద లేకుండా పోయింది. లక్ష్మీదేవి కోపంతో భర్తని విడిచి స్వర్గం నుంచి నిష్క్రమించడంతో సంపద, శ్రేయస్సు, వైభవం కూడా స్వర్గం నుంచి అదృశ్యమయ్యాయి. అప్పుడు దేవతలందరూ పరిష్కారం కోసం విష్ణువు వద్దకు వెళ్లారు. విష్ణువు రాక్షసులతో కలిసి సముద్రాన్ని మథనం చేయమని సూచించాడు. విష్ణువు ఆదేశం మేరకు సముద్ర మథనానికి సన్నాహాలు చేశారు. దీంతో క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా చిలికేందుకు వాసుకి పామును తాడుగా చేశారు. అమృతం కోసం సముద్ర చిలికేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే అమృతానికి ముందు సముద్ర మథనం నుంచి 13 ఇతర విలువైన రత్నాలు కూడా లభించాయి.
- హాలాహలం
సముద్ర మథనం సమయంలో మొదట బయటకువచ్చింది హాలాహలం. సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన ఈ విషం పేరు కాలకూట విషం. దీని ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల గందరగోళం ఏర్పడింది. దేవతలు, రాక్షసులు దహనం మొదలైంది. అప్పుడు శివుడు లోకాన్ని రక్షించేందుకు ఆ విషాన్ని తాగి తన కంఠంలో దాచుకున్నాడు. ఈ విషం ప్రభావం వల్ల మహాదేవుడు గొంతు నీలం రంగులోకి మారింది, అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. - కామధేను ఆవు
సముద్ర మథనం సమయంలో రెండవసారి కామధేను అనే దివ్యమైన ఆవు ఉద్భవించింది. ఈ ఆవు యజ్ఞానికి కావలసిన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. కనుక దీనిని బ్రహ్మఋషులకు ఇచ్చారు. కామధేనువు ఆవులలో అత్యుత్తమమైనదిగా పరిగణించబడింది. - ఉచ్చైశ్రవము
సముద్ర మథనం సమయంలో కామధేనువు తర్వాత ఒక తెల్ల గుర్రం పుట్టింది. దీనిని ఉచ్చైశ్రవం అని అంటారు. ఇది ఏడు తలల దేవతాశ్వము. ఈ గుర్రానికి ఆకాశంలో ఎగరగల శక్తి కూడా ఉంది. దీనిని రాక్షసుల రాజు అయిన బలికి ఇచ్చారు. - ఐరావతం ఏనుగు
సముద్ర మథనం నుంచి నాలుగో వస్తువుగా నాలుగు దంతాలు కలిగిన తెల్ల ఏనుగు ఐరావతం ఉద్భవించింది. ఈ ఏనుగు ప్రకాశం కైలాస పర్వతం కంటే ఎక్కువగా ఉంటుంది. దీనిని దేవతల రాజ ఇంద్రుడికి ఇచ్చారు. ఐరావతం ఇంద్రుడి వాహనం. - కౌస్తుభ మణి
సముద్ర మథనం నుంచి ఐదవ రత్నంగా కౌస్తుభ మణి ఉద్భవించింది. ఈ రత్నం దివ్య తేజస్సుతో కనిపిస్తుంది. అమూల్యమైన మాణిక్యం. దీని కాంతి నాలుగు దిశలకు వ్యాపించింది. విష్ణువు ఈ అరుదైన రత్నాన్ని తన హృదయంలో ధరించాడు. - కల్పవృక్షం
కల్పవృక్షం ఆరవ వస్తువుగా సముద్ర మథనం నుంచి లభించింది. దీనిని కల్పతరు అని కూడా అంటారు. ఇది దైవిక ఔషధాలతో నిండిన కోరికలను తీర్చే చెట్టు. ఈ చెట్టుని ఇంద్రుడుకి ఇచ్చారు. - అప్సరసలు
సముద్ర మథనంలో చాలా అందమైన అప్సరసులు జన్మించారు. రంభ, మేనక, ఘృతాచి, తిలోత్తమ, సుకేశి, చిత్రలేఖ, మంజుఘోషలు జన్మించారు. రంభ విశ్వంలో అత్యంత అందగత్తె. ఇంద్రుడి సభలో రంభ నర్తకి అయ్యింది. - లక్ష్మీదేవి
సముద్ర మథనంలో సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి కనిపించింది. మహావిష్ణువు సముద్ర మథనంలో ప్రధాన ఉద్దేశ్యం లక్ష్మీ దేవిని తిరిగి పొందడమే. కనుక దేవతలు, రాక్షసులు ఇద్దరూ లక్ష్మీదేవిని పొందాలని కోరుకుంటుండగా లక్ష్మీదేవి విష్ణువును ఎంచుకుంది. - సురాభాండం
సముద్ర మథనంలో సురాభాండం కల్లుకు అధిదేవత ఉద్భవించింది. విష్ణువు ఆజ్ఞ ప్రకారం ఈ సురాభాండాన్ని రాక్షసులకు ఇచ్చారు. - చంద్రుడు
సముద్ర మథనం సమయంలో సురాభాండం తర్వత చంద్రుడు ఉద్భవించాడు. శివుడు చంద్రుడిని తలపై ధరించాడు. - పారిజాత వృక్షము
సముద్ర మథనం నుంచి పదకొండవ వస్తువుగా పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉద్భవించింది. ఈ చెట్టును తాకడం ద్వారా శరీర అలసట తొలగిపోతుంది. ఈ చెట్టు దేవతలకు అందించారు. - పాంచజన్య శంఖం
సముద్ర మథనం నుంచి ఒక అరుదైన శంఖం ఉద్భవించింది. దీనిని పాంచజన్య శంఖం అని పిలుస్తారు. ఈ శంఖానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని శబ్దం విజయం, కీర్తి, వైభవం, శుభాలకు చిహ్నంగా నమ్ముతారు. పాంచజన్య శంఖాన్ని అరుదైన రత్నంగా పరిగణిస్తారు. ఈ శంఖాన్ని విష్ణువు స్వీకరించాడు. ఆయన దానిని తన ఆయుధంగా చేసుకున్నాడు. - శారంగ విల్లు
సముద్ర మథనంలో శంఖం తర్వాత శారంగ అనే అద్భుతమైన విల్లు ఉద్భవించింది. ఈ ధనుస్సు కూడా శ్రీ మహా విష్ణువు తీసుకున్నాడు. - ధన్వంతరి, అమృత కలశం
సముద్ర మథనం చివరగా ధన్వంతరి తన చేతుల్లో అమృత కలశాన్ని తీసుకుని ప్రత్యక్షమయ్యాడు. ఆయనను ఆయుర్వేద పితామహుడిగా భావిస్తారు. అమృతం పొందడానికి దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు విష్ణువు మోహిని రూపాన్ని ధరించి దేవతలను అమృతాన్ని పంచాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు