Pawan kalyan simhachalam temple tragedy: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పనితీరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. హోం శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతల నిర్వహణ అభినందనీయమన్నారు. సింహాచలం ప్రమాద ఘటన నేపథ్యంలో తెల్లవారుజామున మూడు గంటలకే ఘటనాస్థలికి చేరుకున్నారని.. సహాయక చర్యలను పర్యవేక్షించారన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నవారు ఏ సమయంలోనైనా ప్రజలకు ఇబ్బందులు వస్తే స్పందించాలని.. హోం మంత్రి వంగలపూడి అనిత అలాగే స్పందించారన్నారు. కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానికి ఆమె బాధ్యతల నిర్వహణ ఓ తార్కాణమని పవన్ కళ్యాణ్ అభినందించారు.

సింహాచలం దుర్ఘటన విషయం తెలియగానే తెల్లవారుజామున మూడు గంటలకే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారని పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలతోనూ, గాయపడిన వారి సంబంధీకులతో మాట్లాడి ఓదార్చారని అన్నారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబానికి కూడా వెన్నంటి ఉండి మనో ధైర్యం ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే దానికి, బాధితులకు ఎలా భరోసా ఇస్తుందో చెప్పడానికి వంగలపూడి అనిత బాధ్యతల నిర్వహణ ఒక తార్కాణమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు.

మరోవైపు గతేడాది నవంబర్లో హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పిఠాపురం పర్యటనలో భాగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఏపీలో శాంతి,భద్రతలపైనా, హోం శాఖ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాల నేపథ్యంలో ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్.. తాను హోం మంత్రిని అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జరుగుతున్న ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత తీసుకోవాలని.. హోంశాఖపై రివ్యూ చేయాలని సూచించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాజాగా వంగలపూడి అనిత పనితీరును పవన్ కళ్యాణ్ ప్రశంసించడం విశేషం.