ప్రకాశం జిల్లాలో పులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. అర్ధవీడు మండలంలో మూడు నెలలుగా పులి సంచరిస్తూ పశువులపై దాడి చేస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను సేకరించి ప్రజలను అప్రమత్తం చేశారు. నల్లమల అటవీ ప్రాంత ప్రజలు సాయంత్రం వేళల్లో అడవిలోకి వెళ్లకూడదని సూచించారు.

మరోవైపు నల్లమల అడవి పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడూ చిరుతలు, పెద్దపులి సంచారం ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలోనూ చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో చిరుత కదలికలు రికార్డయ్యాయి. దీంతో స్థానికులు భయపడిపోయారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు కూడా చేరవేశారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం సహజంగానే ఉంటుందని.. రాత్రి తర్వాత గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు.
మరోవైపు వేసవి కాలం కావటంతో నీరు దొరక్క.. వన్యప్రాణులు ఒక్కోసారి జనావాసాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుమల నడక మార్గంలోనూ చిరుత సంచారం వార్తలు అప్పుడప్పుడు వింటుంటాం. అలాగే శ్రీశైలంలోనూ చిరుత కదలికలు అంటూ వార్తలు వినిపిస్తుంటాయి.
ప్రకాశం జిల్లాలో భూకంపం
మరోవైపు ప్రకాశం జిల్లాలో మంగళవారం భూమి కంపించింది. పొదిలిలో మంగళవారం ఉదయం భూ కంపనాలు చోటుచేసుకున్నాయి. సుమారు 5 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. అలాగే కొత్తూరులోని బ్యాంక్ కాలనీ, ఇస్లాంపేట, రాజు ఆసుపత్రివీధిలలోనూ భూకంపనాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్లల్లోని జనం బయటకు పరుగులు తీశారు.