Vijayawada Machilipatnam National Highway 65: రాష్ట్ర రాజధాని అమరావతికి మచిలీపట్నం పోర్టును అనుసంధానం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా పోర్టుకు రహదారి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఈ అనుసంధానం సాధ్యమవుతుంది. పోర్టు పనులు పూర్తయ్యే సమయానికి రహదారి అందుబాటులోకి రానుంది.

రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి బందరు పోర్టును కనెక్ట్ చేయాలని చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నుంచి బందరు పోర్టుకు రహదారి కనెక్టివిటీ కోరుతోంది. ఈ రెండు ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ – విజయవాడ నేషనల్-65 ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తుది దశకు చేరుకుంది. దాదాపు రూ.7,106 కోట్లతో 161.58 కిలోమీటర్ల మేర ఆరు వరసలుగా రోడ్డును విస్తరించనున్నారు. ఈ మార్గం హైదరాబాద్ ఓఆర్‌ఆర్ నుండి గొల్లపూడి వరకు ఉంటుంది. అయితే గతంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా బందరు పోర్టును కలపాలని నేషనల్ హైవే 216H ను విస్తరించాలని అనుకున్నారు. కానీ, కేంద్రం మళ్లీ ఆలోచన మార్చుకుని విజయవాడ – మచిలీపట్నం నేషనల్ హైవే-65 ను విస్తరించాలని నిర్ణయించింది.
హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుండి మచిలీపట్నం వరకు నేషనల్ హైవే-65 ను ఆరు వరసలుగా విస్తరించేందుకు అడుగులు పడ్డాయి. విజయవాడలో ట్రాఫిక్ తగ్గించడానికి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును రెండు భాగాలుగా కలపాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు దాములూరు దగ్గర ఓఆర్‌ఆర్ మీదుగా కృష్ణాజిల్లాలోని కంకిపాడు వద్ద నేషనల్ హైవే-65కు చేరుకుని బందరు పోర్టుకు వెళ్తాయి. మచిలీపట్నంలో నేషనల్-65కు అనుబంధంగా పోర్టుకు నేరుగా రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా బందరు పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతుంది.
అమరావతి రాజధానికి కూడా మచిలీపట్నం పోర్టు అనుసంధానం అవుతుంది. కంకిపాడు దగ్గర నేషనల్ హైవే-65 నుంచి అమరావతి ఓఆర్‌ఆర్ చలివేంద్రపాలెం మీదుగా వల్లూరుపాలెం, మున్నంగి, కంచెర్లపాలెం, శేకూరు, సేలపాడు, అనంతవరప్పాడు, పుల్లేటిగుంట, లింగాయపాలెం దగ్గర నేషనల్ హైవే-16 కు కలుస్తుంది. అమరావతిలో E-13, E-15 రోడ్లను NH-16 కు కలుపుతున్నారు.. ఈ మార్గాల ద్వారా అమరావతికి మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం బందరు పోర్టు పనులు 40 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి మరో 3 నుండి 6 నెలల సమయం పడుతుంది.
ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో ఆరు లైన్లుగా, ఆ పోర్టును తెలంగాణకు కనెక్ట్ చేస్తారు!
మూడు నెలల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుండి మచిలీపట్నం వరకు నేషనల్ హైవే-65 ఆరు వరసల విస్తరణకు టెండర్లు పిలిస్తే, రెండేళ్లలో పనులు పూర్తవుతాయి. అదే సమయంలో అమరావతి ఓఆర్‌ఆర్ పనులు కూడా మొదలైతే, పూర్తి కావడానికి ఐదేళ్ల పట్టొచ్చంటున్నారు.అమరావతి ఓఆర్‌ఆర్ అందుబాటులోకి వచ్చే వరకు విజయవాడ వెస్ట్ బైపాస్‌ను ఉపయోగించవచ్చు. గొల్లపూడి నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వాహనాలను మళ్లించవచ్చు. తూర్పు బైపాస్ కూడా ఉంటే, ఈ రెండు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉండేవని అధికారులు అంటున్నారు. తూర్పు బైపాస్ లేదు కాబట్టి, వాహనాలను కేసరపల్లి దగ్గర కంకిపాడు బైపాస్ నుంచి నేషనల్ హైవే-65కు వెళ్లొచ్చు.