కర్నూలు జిల్లా వైసీపీ నేత పత్తికొండ మాజీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మొత్తం 16 మంది నిందితుల్లో 11 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది. ఐదుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సుధీర్ఘ విచారణ అనంతరం.. గురువారం 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. బాధితుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మద్దికుంట వెంకటరెడ్డి వాదనలు వినిపించారు.
2017 మే 21న రామకృష్ణాపురంలో వివాహానికి హాజరై వస్తుండగా కృష్ణగిరి సబ్ స్టేషన్ దగ్గర.. నారాయణరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు కాపుగాసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటనలో నారాయణరెడ్డి తో పాటు ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసులో 17 మంది నిందితులు కాగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా గతంలో నిందితుడిగా ఉండేవారు. అయితే అప్పట్లోనే ఆయన పేరును కోర్టు తొలగించింది. సుదీర్ఘకాలం విచారణ అనంతరం 11 మందికి శిక్ష విధించింది కోర్టు.. సాక్షాధారాలు రుజువు కాకపోవడంతో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది
కోర్టు తీర్పు నేపథ్యంలో 11 మంది దోషులను జైలుకు తరలిస్తున్నారు. తీర్పు అనంతరం చెరుకులపాడులో తొగట్చేడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోర్లు తీర్పుపై.. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఏమన్నారంటే..
మరోవైపు కర్నూలు జిల్లా కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పట్ల దివంగత నారాయణరెడ్డి భార్య పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పందించారు. కోర్టు తీర్పుతో న్యాయస్థానాల పట్ల మరింత నమ్మకం పెరిగిందని చెప్పారు. కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుతోనైనా తనలాంటి మరో మహిళకు అన్యాయం జరగకూడదని భావిస్తున్నట్లు తెలిపారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..