Tdp Mp Sister Vedavati Kumari Died In Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయన సోదరి వేదవతి కుమారి మృతి చెందగా, బావ భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, విచారణకు ఆదేశించారు.
హైలైట్:
- ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం
- టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం
- ఒకరు చనిపోగా.. మరొకరికి గాయాలు

ఈ ప్రవైవేట్ హెలికాప్టర్ ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తుండగా ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో.. ఏం జరిగిందో తెలియదు కానీ.. గంగ్నాని ప్రాంతం సమీపంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హెలికాప్టర్లో టెక్నికల్ సమస్య తలెత్తిందా లేక ఇంకేదైనా కారణం వల్ల ప్రమాదం జరిగిందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది . ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, ప్రమాదంపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్టు పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర జరుగుతోంది.. ఈ యాత్ర కోసం, పవిత్ర పుణ్య క్షేత్రాలు (యమునోత్రి, గంగోత్రి, కేధార్నాథ్, భద్రీనాథ్) దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పర్యాటకులు వస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ యాత్రకు పర్యాటకులు హెలీకాప్టర్ను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే హెలీకాప్టర్లో వెళుతుండగా కుప్పకూలిపోయింది. చార్ధామ్ యాత్ర ప్రారంభైన 5 రోజులకే ఈ ప్రమాదం జరగడం బాధాకరం. అయితే వీరిలో తెలుగువారు.. అందులో ఎంపీ సోదరి చనిపోవడం విషాదం నింపింది.