అదానీ గ్రూప్, భూటాన్‌కు చెందిన డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ (DGPC).. గురువారం (మే 8) కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. భూటాన్‌లో 5 వేల మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి ఈ రెండు సంస్థలు ఎంఓయుపై సంతకం చేశాయి. భూటాన్ ప్రధాన మంత్రి దాషో షెరింగ్ టోబ్గే, ఇంధన, సహజ వనరుల మంత్రి లియోన్పో జెమ్ షెరింగ్, ఇతర సీనియర్ ప్రముఖుల సమక్షంలో భూటాన్‌లోని థింఫులో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. ఒప్పందంపై DGPC ఎండీ దాషో ఛెవాంగ్ రింజిన్, అదానీ గ్రీన్ హైడ్రో లిమిటెడ్ COO నరేష్ తెల్గు సంతకం చేశారు. ఈ అవగాహన ఒప్పందం 570/900 మెగావాట్ల వాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం చేసుకున్నారు. దీనిలో DGPC 51 శాతం మెజారిటీ వాటా, అదానీ గ్రూప్ 49 శాతం వాటా కలిగి ఉంటాయి. ప్రాంతీయ ఇంధన భద్రతను పెంచే క్లీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుందని అదానీ గ్రీన్ హైడ్రో లిమిటెడ్ COO (PSP & హైడ్రో) నరేష్ తెల్గు అన్నారు.
అదానీతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం భారత్‌తో తమ బలమైన సంబంధాలు బలోపేతం చేస్తుందని, భూటాన్ సమృద్ధిగా ఉన్న జలవిద్యుత్ వనరులను ఉపయోగించుకోవడంలో రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ఈ ఒప్పందం మూలస్తంభంగా మారనుందని DGPC ఎండి దాషో చెవాంగ్ రింజిన్ అన్నారు. అదానీతో ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భూటాన్ ప్రధాన జలవిద్యుత్ డెవలపర్ అయిన DGPC.. పునరుత్పాదక ఇంధన వనరులను నిర్వహించడంలో ఎన్నో దశాబ్దాల అనుభవం ఉంది. ఈ కంపెనీ భూటాన్ క్లీన్ ఎనర్జీ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశీయ ఇంధన భద్రత, స్థిరమైన అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇటువంటి భాగస్వామ్యాల ద్వారా ప్రాంతీయ ఇంధన సహకారంలో భూటాన్ స్థానాన్ని బలోపేతం చేయడానికి DGPC తన వంతు పాత్ర పోషించనుంది.
భారత్‌లోని ప్రముఖ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారు అయిన అదానీ గ్రూప్, ప్రాజెక్టు అభివృద్ధి, ఫైనాన్సింగ్, మార్కెట్ యాక్సెస్‌లో విస్తృతమైన నైపుణ్యాన్ని తీసుకురానుంది. భూటాన్ జలవిద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో, భారత్ ఇంధన మార్కెట్లకు ప్రాప్యతను సులభతరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సహకారంలో భాగంగా అదానీ భారత్ వాణిజ్య విద్యుత్ మార్కెట్లతో నమ్మకమైన విద్యుత్ సరఫరా, ఏకీకరణకు తోడ్పడుతుంది. ప్రాంతీయ ఇంధన వాణిజ్యంలో భూటాన్ పాత్రను మరింత బలోపేతం చేయడంలో కృషి చేస్తుంది. తాజా ఒప్పందం భూటాన్ పునరుత్పాదక ఇంధన రోడ్‌మ్యాప్‌తో కూడా సమన్వయం చేసుకుంది. 2040 నాటికి 20 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అదనంగా సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోడ్‌మ్యాప్ సౌర, భూఉష్ణ శక్తిలో వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. పెట్టుబడి, ఆవిష్కరణలను ఆకర్షించడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత ప్రోత్సహిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.