ములుగు జిల్లాలోని కర్రెగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు, పోలీసులు ఆపరేషన్ కగార్ చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు మావోయిస్టులను ఎన్‌కౌంటర్ కూడా చేశారు. అయితే తాజాగా అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బుధవారం మరోసారి ములుగు పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే దీన్ని గమనించిన మావోయిస్టులు పోలీసులు, భద్రతా బలగాల లక్ష్యంగా ఆ ప్రాంతాల్లో మందు పాత్రలు పేల్చారు. ఇక ఈ క్రమంలోనే బలగాలపై కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు వడ్ల శ్రీధర్, సందీప్, ఎన్.పవన్‌కల్యాణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరో ఆర్‌ఎస్‌ఐ అధికారి రణధీర్‌కు తీవ్రంగా గాయపడ్డారు.
అమరులైన కానిస్టేబుళ్లకు మంత్రి సీతక్క నివాళి…
మావోయిస్టు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్ల మృతదేహాలను హెలికాప్టర్‌లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత వారి మృతదేహాలను పోలీసు హెడ్‌క్వార్టర్‌కు తీసుకెళ్లారు. అక్కడ అమరులైన కానిస్టేబుళ్లకు మంత్రి సీతక్క, డీజీపీ జితేందర్ నివాళులర్పించారు. వారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరితో పాటు వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, ములుగు ఎస్పీ శబరీష్, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఆ తర్వాత కానిస్టేబుళ్ల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Minister Seethakka
మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుళ్లు వివరాలు..
అమరులైన కానిస్టేబుళ్లలో మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన సందీప్(27), కామారెడ్డి జిల్లా పల్వంచకు చెందిన వడ్ల శ్రీధర్(29) ఉన్నారు.
2018లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌గా ఎంపికైన సందీప్‌కు..2022లో వివాహం అయినట్టు తెలుస్తోంది. ఇక పాల్వంచకు చెందిన శ్రీధర్‌కు కొన్నాళ్ల క్రితమే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. వివాహం తర్వాత శ్రీధర్ భార్య, తల్లితో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్టు సమాచారం. మావోల కాల్పుల్లో చనిపోయిన వారిలో ఏపీలోని ప్రకాశం జిల్లా కొత్తముద్దపాడుకు చెందిన కానిస్టేబుల్ పవన్‌కల్యాణ్ కూడా ఉన్నారు. వీరి కుటుంబం గత 25 ఏళ్లు క్రితం హైదరాబాద్ వలస వచ్చిన ఇక్కడే జీవనం సాగిస్తున్నట్టుత తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..