రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభ మయ్యాయి. అందాల భామలు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు. రేపు నాగార్జునసాగర్ లోని బుద్ధ వనాన్ని సందర్శించ నున్నారు. ఈ నెల 15న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాన్ని, భూదాన్ పోచంపల్లిలోపర్యటిస్తారు. వీరి రాకకోసం పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
బుద్ధుడి చెంతకు.. ముద్దు గుమ్మలు..
ప్రపంచ సుందరీమణుల రేపు 12వ తేదీన నాగార్జునసాగర్‌కు రానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలోఆసియా దేశాలకు చెందిన 30 మంది మిస్ వరల్డ్ పోటీ దారులు నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని ముస్తాబవుతారు. విజయ విహార్ వెనుక భాగాన సాగర తీరాన సుందరీ మణులు మీడియా కోసం గ్రూప్ ఫొటోలు దిగుతారు. విజయ్ విహార్ నుండి ప్రపంచ సుందరీమణులు సాయంత్రం బుద్ధవనానికి చేరుకుంటారు. బుద్ధవనం స్వాగతం తోరణం నుంచి నుంచే తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలుకుతారు. రేపు బుద్దపూర్ణిమ కావడంతో బుద్ధుడి పాదాల వద్ద అందగత్తెలు పుష్పాంజలి ఘటిస్తారు. మహా స్తూపం వద్ద ఫొటో షూట్‌లో పాల్గొంటారు. మహాస్తూపంపై ఉన్న విగ్రహాల గురించి వారికి ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగి రెడ్డి వివరిస్తారు. మహాస్తూపం లోపల ముద్దు గుమ్మలు అష్టబుద్ధుల వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆ తర్వాత మహాస్తూపం లోపల మూడు నిమిషాలు ధ్యానం చేసి ఐదు నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్‌లో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి
బుద్ధుడి జాతక పార్కు..
మహా స్తూపం నుంచి జాతక పార్కును సందర్శించి బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధ చరితపై డ్రామా ఉంటుంది. బుద్ద వనంలో డిన్నర్‌లో పాల్గొని హైదరాబాద్ బయలు దేరుతారు. అందాల భామలు స్టే చేయనున్న విజయ విహార్, బుద్ధవనం, మహా స్తూపానికి విద్యుత్ దీపాలతో అధికారులు అలంకరించారు.
మిస్ వరల్డ్ పోటీదారులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయడంతో పాటు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ విహార్ బుద్ధవనం లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
15న పోచంపల్లిలో ‘ఇక్కత్ థీమ్’..
ఇక్కత్ పట్టు వస్త్రాలకు భూదాన్ పోచంపల్లి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైన భూదాన్ పోచంపల్లికి ఈ నెల 15వ తేదీన 25 మంది ప్రపంచ సుందరీమణులు రానున్నారు. వారి పర్యటన కోసం అధికారులు రూరల్ టూరిజం పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోచంపల్లికి సాయంత్రం వచ్చే అందాల భామలకు టూరిజం ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారు. వారికి బొట్టుపెట్టి, పూలమాలలు వేసి సత్కరిస్తారు. పార్క్ లో అలంకరించిన టెర్రాకోట్ కుండలను ముద్దుగుమ్మలు పరిశీలిస్తారు. లోపలి గచ్చు ప్రాంతంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన మన బతుకమ్మను తిలకిస్తారు. ఇండో – వెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్‌వాక్ లో పాల్గొననున్నారు. పోచంపల్లిలో రెండు గంటలపాటు గడపనున్న ముద్దుగుమ్మల కోసం అడుగడుగునా ఇక్కత్ థీమ్ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
యాదగిరీశుడి దర్శనం…
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని 10 మంది సుందరీమణులు దర్శించుకొనున్నారు. ఈనెల 15వ తేదీన సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకొనీ ఆలయ తూర్పు మాఢవీధిలో ఉన్న అఖండ దీపారాధనకు ప్రత్యేక పూజలు చేస్తారు. తూర్పు ద్వారం నుంచి తిరువీధుల్లో వచ్చే సుందరి మణులకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలుకుతారు. ఆలయంలో ఆంజనేయస్వామి, గండబేరుండ నరసింహస్వామిని దర్శించుకొని గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానాలయ ముఖమండపం, తూర్పు రాజగోపురం వద్ద రంగురంగుల పూలు, అరటి, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ముద్దుగుమ్మల పర్యటన కోసం అధికారి యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..