చిత్తూరు జిల్లాలో అటవీ భూములను అక్రమించారన్న అభియోగాలపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. ఒకవైపు తిరుపతిలో బుగ్గ మఠం ఆక్రమణలపై నోటీసులు, మరోవైపు పులిచెర్ల మండలంలో అటవీ శాఖ భూములను ఆక్రమించారన్న అభియోగాలతో కేసులు నమోదు కావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని కేసులు వెంటాడుతున్నాయన్న పరిస్థితి నెలకొంది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ చేసిన విచారణ నివేదిక పవన్ కళ్యాణ్ కు ఆదేశంతో ఈ మేరకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కేసులు బనాయించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు.. అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సహకరించిన అధికారులను గుర్తించి శాఖా పరమైన చర్యలు చేపట్టాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు.. దీంతో పలువురు అధికారుల్లో గుబులు రేపుతోంది. ఈ మేరకు అటవీ భూముల అన్యాక్రాంతంపై పెద్దిరెడ్డి తో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోపాటు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారక నాథరెడ్డి, ఇందిరమ్మలపై కేసు నమోదు చేసింది అటవీశాఖ. పులిచర్ల మండలం మంగళం పేట అటవీ భూముల ఆక్రమణపై ఈ మేరకు చర్యలు తీసుకుంది.
మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారణతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అటవీ భూముల ఆక్రమణపై చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు చర్యలు తీసుకుంది.
అటవీ భూములను ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి హాని కలిగించేలా వ్యవహరించారని ప్రైమరీ అఫెవ్స్ రిపోర్టులో పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం.. చర్యలు చేపడుతోంది. పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో భూముల ఆక్రమణల వ్యవహారం రెండు నెలలు క్రితమే బయటికి వచ్చినా పూర్తి స్థాయి నివేదిక వచ్చాకే అటవీశాఖ చర్యలు తీసుకోవడం చర్చగా మారింది. జాప్యానికి కారణాలపై అనేక విమర్శలు ఉన్నా.. ఈ క్రమంలోనే.. పెద్దిరెడ్డి కుటుంబంపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
అటవీ భూముల అన్యక్రాంతం వ్యవహారంపై త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్న చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారులు.. వివరాలు వెల్లడించే సాహసం చేయకపోవడం కొసమెరుపు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..