
ఏంటంటీ బాబూ.. ఆ పెద్ద మనిషికి చిన్నమెదడు చిట్లిపోయిందా..? చిల్లర చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు.. అని చిరాకుపడ్డం ప్రపంచం మొత్తానికి అలవాటైపోయింది. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్ మేనరిజంతో సొంత దేశానికే విసుగెత్తిపోతోంది. పూటకోసారి మాట మారుస్తున్న ట్రంప్ వ్యవహార శైలి.. రోజురోజుకూ ఆయన్ను కామెడీకింగ్గా మార్చేస్తోందా? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఆయనిచ్చిన నినాదానికి అంతరార్థం ఇదేనా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు రేంజ్లో ఉన్నాయి మరి ట్రంప్ గారి పెర్ఫామెన్సులు..!
ఆ మధ్య వన్ టూ వన్ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై చిర్రుబుర్రులాడారు. అంతకుముందు దిగుమతులపై ఆంక్షలు పెంచినట్టే పెంచి ఆనక తగ్గించి డ్రాగన్ కంట్రీతో చిల్లర గేమ్ ఆడారు. మొన్నీమధ్యేగా ఆపరేషన్ సింధూర్‌కి చెయ్యి అడ్డం పెట్టింది నేనేగా అని దండోరా వేసుకున్నారు. ఇప్పుడు పుతిన్‌ను తప్పుదారి పట్టించేలా మాట్లాడి తన రూటే వేరన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సీజ్ఫైర్ చేసింది తానేనని నిన్న.. యుద్ధం మళ్లీ ఏ క్షణమైనా రావొచ్చంటున్నాడు ఇప్పుడు..!
ఒకరోజు వార్నింగ్ ఇస్తారు. వెంటనే కాంప్రమైజ్ అయిపోతారు. ఒకసారి పొట్టుపొట్టు తిడతారు కాసేపాగి ప్రశంసల్లో ముంచెత్తుతారు. కవ్వించేది తనే… కాపాడానంటున్నదీ తనే! రెమో ఆయనే రామూ ఆయనే. మనసులో ఏదనిపిస్తే అది చేసే బోళా మనిషి అనుకోవాలా లేక చిన్న పిల్లాడి మనస్తత్వమని సరిపెట్టుకోవాలా..? ఫస్ట్ టర్మ్‌లో నన్ను అందరూ ఆడుకున్నారు. నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తొక్కాలని చూశారు. సెకండ్ టర్మ్‌లో నా టైమొచ్చింది. ఇప్పుడు మిమ్మల్నందరినీ తరిమితరిమి కొడతా.. తిక్క పుట్టిస్తా.. అని ఇటీవలే తన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌పై ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఆయన మనస్తత్వం ఏ పరిస్థితిలో ఉందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు.
తన విచిత్ర విన్యాసాలతో ఇంటా గెలవలేక, రచ్చా గెలవలేక సతమతమౌతున్నారు అమెరికా అధ్యక్షుడు. నో కింగ్స్ డే పేరుతో జరిగే ఇమ్మిగ్రెంట్ల ఆందోళనతో అంతర్గతంగా ఆగమాగమైపోతోంది అగ్రరాజ్యం అమెరికా. అటు ట్రంప్ మాత్రం మిగతా దేశాల్లో యుద్ధ సన్నివేశాలకు తనదైన డైరెక్షన్ ఇస్తూ బ్యాక్‌డోర్ పాలిటిక్స్ చేస్తూ అభాసుపాలౌతున్నారు. ఇలా కిందామీదా పడుతున్న అమెరికా అధ్యక్షులవారికి ఇండియా కూడా చాచికొట్టనంత పనిచేసింది. నేనొస్తే యుద్ధాల్ని ఆపేస్తానంటూ ఎన్నికల ముందు శాంతికాముకుడిలా ఫోజు కొట్టిన డొనాల్డ్ ట్రంప్.. పవర్లోకొచ్చాక ఆ దిశగా ప్రయత్నాలు చేశారో లేదో గానీ.. ప్రయత్నించినట్టు కలరింగ్ మాత్రం ఇస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన పెదరాయుడ్ని తానేనంటూ 14 సార్లు చెప్పినా చాటింపు వేసుకున్నారు. తర్వాత G-7 సమ్మిట్‌లో పాల్గొని వెనక్కొస్తూ అమెరికా అధ్యక్షుడికి తిరగమాత పెట్టేశారు మన మోదీ. దాయాది దేశం రిక్వెస్టు మేరకే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని, ఇందులో అమెరికా రోల్ ఎక్కడా లేదని ఖరాఖండిగా చెప్పేసినప్పుడు ట్రంప్ మొహం కందగడ్డగా మారిపోయ్యుండొచ్చు.
అంతెందుకు… లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తావనకే వద్దాం. డెమోక్రటిక్ పార్టీ మేయర్ ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. న్యూయార్క్ నగర రాజకీయాల్లో ఇదొక అనూహ్య పరిణామం. రాజకీయ ఉద్ధండుడు, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను సైతం ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచిన మమ్దానీ ట్రంప్ మేస్టారుకు మాత్రం పిచ్చోడుగా కనిపిస్తున్నాడు. డెమొక్రటిక్ పార్టీ పైనా.. ఆ పార్టీలోని నేతలపైనా అక్కసు వెళ్లగక్కుతూ ట్రంప్ వేసిన సెటైర్లు… ఆయన పిన్నబుద్ధిని మళ్లీ బైటపెట్టేశాయి. జోహ్రాన్ మామ్దానీ 100 శాతం కమ్యూనిస్ట్ పిచ్చోడు అంటూ ట్రంప్ చేసిన విమర్శలు, ఆయన ఆడిన వెటకారం ట్రంప్ ఒరిజినల్ని బైటపెట్టేసింది.
గిల్లేదీ ఆయనే తర్వాత ఆయింట్మెంట్ పూసేది కూడా ఆయనే. యుద్ధం చేద్దామా అని రెచ్చగొట్టేదీ ఆయనే.. ఇప్పుడు వార్ వద్దని ఆపిందీ ఆయనే. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ టార్గెట్‌గా రెండువారాలుగా ట్రంప్ ఆడుతున్న గేమ్ మామూలు గేమ్ కాదు. కాల్పుల విరమణకు పిలుపునిచ్చి ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల్ని కీలుబొమ్మలను చేసి ఆడించారా..? అనే డౌట్లు పుట్టించింది ట్రంప్ తీరు. ఇరాన్‌పైకి ఇజ్రాయెల్‌ను ఎగదోయడమే కాదు.. తనకు తాను యుద్ధానికి దిగి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కడిగి కళ్లాపి జల్లానంటూ లేని మీసాన్ని మెలేశారు. మరణమా శరణమా ఏదో ఒకటే నీకు ఛాయిస్ అంటూ ఇరాన్‌కి వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చి… వైమానిక దాడులు వెంటనే ఆపేయాలంటూ ఇజ్రాయెల్‌పై కస్సుబుస్సులాడారు.
ఎందుకు మొదలెట్టినట్టు..? ఎందుకు విరమించినట్లు ? ఇరాన్ సంధికొచ్చిందా.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గాయా అంటే అదీలేదు. విచిత్రం ఏంటంటే ఎప్పుడూలేనిది ఈసారి తన జిగ్రీ దోస్త్ ఇజ్రాయెల్‌పైనే కోప్పడ్డం ట్రంప్ మైండ్‌సెట్‌పై డౌట్లు పుట్టిస్తోంది. అలాగని బుర్రలో ఏదనిపిస్తే అది చేసే బోళా మనిషి అనుకోడానికీ లేదు. ఎందుకంటే.. ట్రంప్ కెరీర్లో శునక విశ్వాసాల కంటే నక్క నాటకాలే ఎక్కువ. ఎందుకు, ఎవర్ని, ఎప్పుడు, ఎలా ప్రేమిస్తాడో తెలీదు. ఆ వెంటనే ఎందుకు కటీఫ్ చెబుతాడో తెలీదు. మోదీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటారు… అదే నోటితో ఐ లవ్ పాకిస్తాన్ అని యుగళగీతం ఎత్తుకుంటారు. ప్రపంచ తీవ్రవాదానికి అడ్డాగా మారి, ఒసామాబిన్ లాడెన్‌ను జేబులో దాచిపెట్టుకున్న పాకిస్తాన్‌ను సైతం చంకనెత్తుకున్న చరిత్రుంది ట్రంప్ సారుకు. ముద్దొచ్చినప్పుడు… పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను పిలిచి డిన్నర్ మీటింగ్‌లో కూర్చోబెట్టుకుంటారు. కట్‌చేస్తే… మాకు తెలీకుండా న్యూక్లియర్ బాలిస్టిక్ మిస్సైళ్లను తయారుచేసుకుంటావా అని అదే పాకిస్తాన్ మీద కన్నెర్ర జేస్తారు.
మొన్నామధ్య వలసదారులతోనే మనకీ ఇక్కట్లు అంటూ.. ఇమ్మిగ్రెంట్ల ఏరివేతకు తెగబడ్డారు. సోషల్ మీడియా ఖాతాల్ని పరిశీలించి సచ్ఛీలురుగా తేలితేనే వీసాలిస్తాం అంటూ మన విద్యార్థులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. విదేశీ స్టూడెంట్స్‌కు అడ్మిషన్లు ఇస్తారా అంటూ.. హార్వర్డ్ యూనివర్సిటీకి వార్నింగ్ ఇచ్చినప్పుడు కామెడీ పీస్లాగే అనిపించారు. సో… అపరిచితుడు సినిమాలో రెమో ఆయనే రామూ ఆయనే. గజనీ కంటే ఘోరంగా ఉంటూ ప్రపంచదేశాల్ని తిక్క పుట్టిస్తోంది ట్రంప్ గారి ట్రాన్స్ఫర్మేషన్. అమెరికా అధ్యక్షుడ్ని మన కేఏ పాల్‌తో పోలిక పెట్టాల్సి రావడం ఒక పరాకాష్ట.!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..