అదిగో ఆనంద నిలయం అని ఆనందంగా వెళ్లారో అవాక్కయిపోతారు. అక్కడకు వెళితే, చికెన్, మటన్ బిర్యానీల ఘాటు వాసన గుప్పుమంటుంది. అది ఆలయంలా కనిపించే నాన్‌వెజ్ హోటల్. గోవిందుడి పేరుతో భక్తులను ఇలా బురిడీ కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇక తిరుమల యాత్ర పేరుతో వెంకన్నను ఏకంగా గేమింగ్ యాప్‌లో దింపేశారు మరికొందరు. ఇక ఓ సినిమాలో ఏకంగా గోవింద నామాలపైనే పేరడీ పాటలు పెట్టారు మరికొందరు. గాడ్‌తో గేమ్స్ వద్దన్నా వినకుండా, ఇలా చెలరేగిపోతున్నారు కొందరు ప్రబుద్ధులు.
పైకి ఆనంద నిలయం..లోన నాన్‌వెజ్ హోటల్
పైకి ఆనంద నిలయంలా కనిపించే ఆలయ వాతావరణం.. లోపల నాన్‌వెజ్ మిలటరీ హోటల్ రన్నింగ్. దేవుడిని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కన్నింగ్ గాళ్లు. చూడడానికి శ్రీ వేంకటేశ్వరుడి మందిరంలా ఉన్నా అది దేవాలయం కాదు. రాజమండ్రి-విశాఖ హైవేపై తిరుమల ఆనందనిలయాన్ని పోలి ఉన్న ఓ సెట్టింగ్. ఓ మిలటరీ హోటల్‌కి ఈ తరహా సెట్టింగ్‌లు అద్ది క్యాష్ చేసుకుంటున్నాడు ఓ నిర్వాహకుడు. మల్లిపల్లి దగ్గర ఓ హోట్‌లో తిరుమల ఆనంద నిలయంలా సెట్టింగ్ ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొంది. హోటల్‌లో తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే ఆనంద నిలయం సెట్టింగ్‌ని వేసి, అక్కడే నాన్‌వెజ్ వడ్డిస్తూ మిలటరీ హోటల్ నడుపుతున్నారు కొందరు ప్రబుద్ధులు.
ఇవి కూడా చదవండి
హోటల్ నిర్వాహకులపై టీటీడీకి ఫిర్యాదు
దీంతో భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ జనసేన ఆగ్రహించింది. క్షమాపణలు చెప్పి 24గంటల్లో సెట్టింగ్ తొలగించకపోతే దాడిచేస్తామని జనసేన నేత కిరణ్ రాయల్ వార్నింగ్ ఇచ్చారు. హోటల్ తీరుపై టీటీడీ చైర్మన్, EOకి ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. కొద్ది రోజుల క్రితమే తిరుమల శ్రీవారి ఆలయ యాత్ర పేరుతో ఓ గేమింగ్ యాప్‌ను డెవలప్ చేసింది తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ సంస్థ. రోబ్లెక్స్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ను ఉంచారు నిర్వాహకులు. తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డు ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్‌ను డిజైన్ చేశారు. ఆలయానికి ఎలా వెళ్లాలో ఇందులో వివరించారు. ఈ గేమింగ్ యాప్‌ని అడ్డుపెట్టుకుని శ్రీవారి పేరుతో వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు. టీవీ9 కథనాలతో టీటీడీ రియాక్ట్ అయింది. ఈ గేమింగ్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ఆదేశించారు
గోవిందుడి పాటపై పేరడీ.. భక్తుల ఆగ్రహంతో తోక ముడిచిన నిర్మాతలు
అంతకుముందు DD నెక్ట్స్ లెవెల్ అనే సినిమాలో గోవింద అనే పాట సాహిత్యం, దాని చిత్రీకరణపై వివాదం తలెత్తింది. డీడీ నెక్ట్స్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద పాటను పేరడీ చేశారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తిరుమల శ్రీవారిని అవమానించారని బీజేపీ మండిపడింది. భక్తుల నుంచి తీవ్ర నిరసన రావడంతో నిర్మాతలు, ఆ పాటలోని అభ్యంతరకర భాగాలను తొలగించారు. తిరుమల వెంకన్నతోనే ఇలా గేమ్స్ ఆడుతున్నారు కొందరు ప్రబుద్ధులు. వీళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..