Tirumala Hotel Prices False Messages: తిరుమలలో హోటళ్ల ధరలు తగ్గాయంటూ ఓ ధరల పట్టింక వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. హోటళ్లలో ఆహార ధరలు తగ్గించారనే వార్తల్లో నిజం లేదని, ఇది తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని భక్తులకు సూచించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ అధికారికంగా ప్రకటించే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపింది.
హైలైట్:
- తిరుమల హోటల్స్‌లో ధరలు తగ్గింపు
- సోషల్ మీడియా వేదికగా ఓ పట్టిక వైరల్
- స్పందించిన టీటీడీ.. క్లారిటీ ఇచ్చారు

‘గతంలో రెండు ఇడ్లీ ధర రూ.25 ఉండేదని, ఇప్పుడు దానిని రూ.7.50.. రెండు చపాతి ధర గతంలో రూ.60 ఉండేదని, ఇప్పుడు రూ.20కు.. టీ గతంలో రూ.15 ఉంటే, ఇప్పుడు దానిని రూ.5.. వెజిటబుల్ బిర్యానీ గతంలో రూ.50 ఉంటే ఇప్పుడు రూ.19.. ఉప్మా గతంలో రూ.20 ఉంటే, ఇప్పుడు దానిని రూ.9.. ప్లేట్ మీల్స్ గతంలో రూ.60 ఉంటే ఇప్పుడు రూ.22.50.. ఫుల్ మీల్స్ గతంలో రూ.100 ఉంటే ఇప్పుడు రూ.31’ మాత్రమే అంటూ ఓ ధర పట్టికను వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పట్టికపై చర్చ జరుగుతోంది.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. లడ్డూల కోసం క్యూ అవసరం లేదు
తిరుమలలోని హోటల్స్‌లో ధరలు తగ్గించారంటూ జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. తిరుమలలోని హోటల్స్‌లో ఫుడ్ ధరలు తగ్గించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది టీటీడీ. ఇలాంటి వాదనలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి అని తెలిపింది. ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది టీటీడీ. ‘ఇలాంటి తప్పుడు వార్తలు, ప్రచారంతో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను గందరగోళానికి గురి చేయొద్దని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తిరుమల శ్రీవారి భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org, టీటీడీ కాల్ సెంటర్ 18004254141 ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో అనుమానాస్పద సమాచారాన్ని షేర్ చేయొద్దు’ అని తెలిపింది టీటీడీ. మొత్తం మీద ఈ ధరల అంశంపై క్లారిటీ వచ్చేసింది.