Pashamylaram Tragedy: ఉద్యోగంలో చేరిన రెండునెలలకే కబలించిన మృత్యువు – east godavari district chagallu young woman died at pashamylaram sigachi factory blast
బాగా చదువుకుంది.. జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగంలో చేరింది. చిన్న చిన్న పనులు చేసుకుంటున్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని అనుకుంది. కానీ, తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలచిందని.. ఉద్యోగంలో చేరిన రెండు నెలలకే ఆమెను మృత్యువు కబళించింది. ఆమె ఆశలన్నీ ఆవిరై మృత్యు ఒడికి చేరింది.పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన పసన్న అనే యువతి మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే, ప్రసన్న రెండు నెలల క్రితమే ఫ్యాక్టరీలో కెమిస్ట్‌గా ఉద్యోగంలో చేరిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రసన్న తండ్రి శ్రీనివాసరావు.. ఆయన మదర్ థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి రామలక్ష్మి ఆశా కార్యకర్త. వీరికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు ప్రసన్న ఇటీవలే సిగాచీ కంపెనీలో ఉద్యోగంలో చేరగా.. చిన్న కూతురు ప్రభుకుమారి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది.