ICC Test Rankings : ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో టీం ఇండియా యంగ్ ప్లేయర్లు అదరగొట్టేశారు. స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలోకి దూసుకెళ్లాడు. గత వారం ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించి.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఈ ప్రదర్శనతో తను ఓ స్థానం పైకి ఎగబాకి.. 801 పాయింట్లతో తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌ను చేరుకున్నాడు. ప్రస్తుతం టాప్ ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ కన్నా కేవలం 88 పాయింట్ల వెనుక ఉన్నాడు.
రిషబ్ పంత్ హెడింగ్లీ టెస్టులో 134, 118 పరుగులతో అద్భుతమైన సెంచరీలు సాధించాడు. భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం రిషబ్ పంత్ ఆటతీరు హైలైట్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన అతడిని టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేర్చింది. 2022లో అతను సాధించిన కెరీర్ బెస్ట్ ఐదో స్థానానికి ఇది మరో స్థానం దూరంలోనే ఉంది.
ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతను జో రూట్ కంటే 15 పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ లీడ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. దీంతో అతను తన కెరీర్ బెస్ట్ ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇతర భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇండియా ప్లేయర్లలో అత్యుత్తమ ర్యాంకులో కొనసాగుతున్నాడు. కెప్టెన్ శుభమాన్ గిల్ మాత్రం ఒక స్థానం దిగజారి 21వ స్థానానికి చేరుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో మాత్రం జస్ప్రీత్ బుమ్రా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్లు తీసిన తర్వాత తను 907 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడా, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ ఒక స్థానం పైకి ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకుని, పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీని వెనక్కి నెట్టాడు.
ఇదిలా ఉండగా టీంఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా, తన నంబర్ 1 టెస్ట్ ఆల్‌రౌండర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు, వెస్టిండీస్ పేసర్ జయ్‌డెన్ సీల్స్ ఒక స్థానం పైకి ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బంగ్లాదేశ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఒక స్థానం పైకి ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు.
జింబాబ్వేపై బులోవాయోలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సౌతాఫ్రికా ఇద్దరు ప్లేయర్లు మంచి ర్యాంకులు సాధించారు. వియాన్ ముల్డర్ సెంచరీ సాధించి ఏడు స్థానాలు పైకి ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. అదే మ్యాచ్‌లో సెంచరీ సాధించి కార్బిన్ బోష్ ఏకంగా 42 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..