Ntr Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లలోని అవకతవకలపై దృష్టి సారించింది. గత ప్రభుత్వం హయాంలో నిబంధనలు పాటించకుండా అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 7.86 లక్షల పింఛన్లను పరిశీలించగా లక్ష మందికి పైగా అనర్హులుగా తేలారు. పులివెందులలో బోగస్ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయని, తక్కువగా కాకినాడలో ఉన్నాయని గుర్తించారు. తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్లు పొందిన 50 వేల మందికి పైగా లబ్ధిదారులను గుర్తించి, సదరం సర్టిఫికెట్ల కోసం నోటీసులు జారీ చేశారు.
హైలైట్:
- ఏపీలో బోగస్ పింఛన్‌లపై ఫోకస్ పెట్టారు
- కచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి
- మరో అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా వినికిడి లోపం, అంధత్వం, రేచీకటి లేకపోయినా, చేతులు కాళ్లు వంకర్లు లేకపోయినా సరే ఉన్నట్లుగా పత్రాలను సృష్టించి పింఛన్లు పొందుతున్నట్లు గుర్తించారు. వీరంతా తప్పుడు సదరం సర్టిఫికెట్లు సమర్పించినట్లు గుర్తించారు. మొత్తం 50,540 మంది తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందుతున్నారని తేల్చారు. 23,200 మంది కంటి చూపు బావున్నా సరే.. సరిగా లేనట్లు సర్టిఫికెట్ పొంది.. 20వేలమంది చెవుడు లేకున్నా ఉన్నట్లు బోగస్ పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 5.10 లక్షల మంది దివ్యాంగుల కేటగిరిలో ఉన్నవారికి సదరం ధ్రువీకరణ పత్రాల కోసం నోటీసులు ఇచ్చారు.. తనిఖీలకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ 5.10 లక్షలమందిలో 4.76 లక్షల మంది వైద్యులు మాత్రమే తనిఖీలకు వచ్చారు. తనిఖీలకు రాని మిగిలిన వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తామంటున్నారు అధికారులు. ఒకవేళ అప్పటికీ రాకపోతే చర్యలు తప్పవంటున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కేటగిరిలో పింఛన్‌లు పొందుతున్నవారిలో అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది.. ఈ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది.