భారత శాస్త్రీయ సంగీతానికి ఎంతో అద్భుత చరిత్ర ఉంది. విదేశీయులు సైతం మన సంగీతానికి ముగ్ధులై..దానిని నేర్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కళారూపకంగా మాత్రమే కాదు ఆరోగ్య పరంగానూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అవును ఇండియన్ క్లాసికల్ రాగాలు మెదడు కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐఐటీ మండి.. ఐఐటీ కాన్పూర్ సహకారంతో నిర్వహించిన అధ్యయనంలో.. శాస్త్రీయ సంగీత రాగాలు శ్రద్ధను పెంచుడంతో పాటు భావోద్వేగ నియంత్రణ, మానసిక స్థిరత్వాన్ని అందిస్తాయని తేలింది. ఒత్తిడి, మెంటల్ ఓవర్‌లోడ్, భావోద్వేగ డిస్‌కనెక్షన్ అన్ని వయసులవారిలో సర్వసాధారణం అవుతున్నాయి. ఈ క్రమంలో భావోద్వేగ సమతుల్యత కోసం ప్రజలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇక్కడే భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రత్యేకంగా నిలుస్తుందని ఐఐటీ మండి డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరా అన్నారు. ప్రతి రాగం నిర్దిష్ట భావోద్వేగ స్థితులను ప్రేరేపిస్తాయని.. ఇది మనస్సుకు ప్రశాంతతను కలిగించి.. ఆనందానికి మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. 40 మందితో నిర్వహించిన ఈ అధ్యయనంలో భారతీయ శాస్త్రీయ సంగీతం.. నాడీ కార్యకలాపాలలో స్థిరమైన పరివర్తనలకు దారితీస్తుందని, మానసిక ఆరోగ్యానికి సంగీతం ఒక మంచి సాధనంగా పనిచేస్తుందని కనుగొన్నట్లు తెలిపారు.
భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క చికిత్సా సామర్థ్యాన్ని ఈ పరిశోధన హైలెట్ చేస్తుంది. ప్రధానంగా రాగ దర్బారి మనస్సును ప్రశాంతంగా ఉంచి.. శ్రద్ధను పెంచుతుంది. పరీక్షలు లేదా ముఖ్యమైన సమావేశాలకు ముందు ఇది సిఫార్సు చేయబడింది. ఇక రాగ జోగియా.. కాన్సన్ ట్రేషన్ నెట్‌వర్క్‌ను పెంచుతుందని.. భావోద్వేగాలను నియంత్రించి ప్రశాంతతను కలిగిస్తుందని తేలింది. కాగా రాగ జోగియా మెంటల్ స్ట్రెస్, దుఃఖాన్ని అదుపుచేయడానికి సహాయపడుతుంది.
శాస్త్రీయ రాగాల వల్ల నాడీ కార్యకలాపాలలో గమనించిన మార్పులు యాదృచ్ఛికం కాదని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఆశిష్ గుప్తా నొక్కి చెప్పారు. భారతీయ శాస్త్రీయ సంగీతం మానసిక ఆరోగ్యానికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇది కచ్చితంగా ఆచరణీయ ఫార్మూలా అని లక్ష్మీధర్ బెహరా అన్నారు. దాని పునాది ఇప్పటికే బలంగా ఉందని..రాగ చికిత్స మన దేశంలో శతాబ్దాలుగా ఉందని గుర్తు చేశారు. అయితే తాజా అధ్యయనంలో రాగాలకు మెదడు ఎలా ప్రభావితమవుతుందనే అంశాలు శాస్త్రీయంగా ధృవీకరణ అయ్యిందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..