మాలిలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ పౌరులను అల్-ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారులు గురువారం(జూలై 03) దీనిని ధృవీకరించారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలోని అనేక ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇంతలో, భారతీయ పౌరులను కిడ్నాప్ చేశారు. దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. వారిని విడుదల చేయించేందుకు మాలి ప్రభుత్వాన్ని కోరింది.
భారతీయుల కిడ్నాప్ తర్వాత, వారిని సురక్షితంగా, త్వరగా విడుదల చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని భారతదేశం మాలి ప్రభుత్వాన్ని కోరింది. కేస్‌లోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భారతీయుల కిడ్నాప్‌పై విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. “జూలై 1న దాడి చేసిన బృందం ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ముగ్గురు భారతీయ పౌరులను బలవంతంగా బందీలుగా తీసుకువెళ్లారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం జరిగిన దాడులకు అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్ (JNIM) బాధ్యత వహించింది. కానీ కిడ్నాప్ గురించి ఎవరూ వ్యాఖ్యానించలేదు. ఈ విషయంలో భారతదేశం మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.
India expresses deep concern regarding abduction of three Indian nationals employed at Diamond Cement Factory in Kayes, #Mali.
India unequivocally condemns this act of violence and calls upon the Government of Mali to take all necessary measures to secure safe and expeditious… pic.twitter.com/0xFmXmjC13
— All India Radio News (@airnewsalerts) July 2, 2025
విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. మాలిలోని అన్ని భారతీయ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరింత సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. “మంత్రిత్వ శాఖ సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తూనే ఉంటుంది. అపహరణకు గురైన భారతీయ పౌరులను వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉంది” అని ప్రకటన పేర్కొంది.
గత కొన్ని సంవత్సరాలలో మాలిలో అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. జూలై 1న జరిగిన ఈ ఉగ్రవాద దాడికి ముందు, గత సంవత్సరం సెప్టెంబర్ 17న బమాకోలోని అనేక చోట్ల దాడి జరిగింది. AFP వార్తా సంస్థ వార్తల ప్రకారం, ఈ దాడిలో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో, 200 మందికి పైగా గాయపడ్డారు. అంతకుముందు సెప్టెంబర్ 7, 2023న, టింబక్టు సమీపంలోని నైజర్ నదిలో ఒక పడవపై దాడి జరిగింది. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ నివేదిక ప్రకారం, ఈ దాడిలో 74 మంది మరణించారు. ఇందులో 49 మంది పౌరులు ఉండగా, 20 మంది దాడి చేసినవారితోపాటు పడవ భద్రతా బృందానికి చెందిన వ్యక్తులు ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..