కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామానికి చెందిన యువతి అదృశ్యంపై మిస్టరీ వీడింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వేంపల్లి శివారు ప్రాంతంలో సదరు యువతిని ట్రేస్ చేశారు పోలీసులు. అనంతరం యువతి నీరసంగా ఉండటంతో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అటు యువతి అదృశ్యంపై మంగళవారం రాత్రి వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామానికి చెందిన యువతి అదృశ్యం కావడంతో గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.
మంగళవారం మధ్యాహ్నం గొర్రెలు మేపుకునేందుకు వేంపల్లి సమీపంలోని కొండల్లోకి సాయద్ సమయ అనే యువతి వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండాపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు సదరు యువతి కుటుంబసభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. గొర్రెలు మేపే ప్రదేశం వద్దకు వెళ్లిన యువతితో చనువుగా ఓ వ్యక్తి, అతడితో పాటు స్నేహితులు కూడా వెళ్లినట్టు గుర్తించారు.
రెండు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. వేంపల్లి శివారు ప్రాంతంలో సదరు యువతిని ట్రేస్ చేశారు. యువతి మధ్యాహ్నం నుంచి ఏం తినకపోవడంతో అనారోగ్యంగా ఉండటం వల్ల.. కడప రిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం యువతి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతోందని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ అన్నారు. యువతితో చనువుగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. వేంపల్లి శివారు ప్రాతంలో అసలేం జరిగింది అనే దానిపై విచారణ చేపట్టాం. యువతి గొర్రెలు కాసే సమయంలో అక్కడికి ఎవరెవరు వెళ్లారన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. కాగా, ప్రస్తుతం యువతి సేఫ్‌గా ఉందని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..