రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. రాష్ట్రంలో తాజాగా కొత్త రిజిస్ట్రేషన్ చట్టం అమలులోకి వచ్చింది. అక్రమ రిజిస్ట్రేషన్‌ల రద్దు అధికారం కలెక్టర్లకు కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సివిల్ కోర్టులకు మాత్రమే అధికారం ఉండేది. కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అధికారాలు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. ఆధార్, సర్వే నెంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 2ని డెడ్‌లైన్‌గా పెట్టుకుని పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఇటీవల రెవెన్యూ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రూ.10లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. రూ. 10లక్షలు దాటిన భూములకు రూ.వెయ్యి చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. మెజార్టీ రెవెన్యూ సమస్యలను అక్టోబరు 2లోగా పరిష్కరించాలని సూచించారు.
ఫ్రీ హోల్డ్ భూములు, రైతులకు కొత్త పాస్ బుక్స్, రెవెన్యూశాఖలో ఉన్న సమస్యలు, భూ సంస్కరణల పై సమీక్ష నిర్వహించారు భూసమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై రివ్యూ చేశారు. రెవెన్యూ శాఖలో మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెవెన్యూ యంత్రాంగంలో ఉద్యోగులు, అధికారుల కొరత, పనిభారం వంటి అంశాలపై సమీక్షించారు.
ప్రతి భూమికి సంబంధించి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సమీక్షలో నిర్ణయించారు. క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు వివిధ రకాల భూములకు… రంగుల పాస్‌బుక్కులు కేటాయించాలని నిర్ణయించారు ఆగస్టు 15 నుంచి ఉచితంగా వాటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇక 2027 డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు.