ఇవాళ గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశానికి ప్లాన్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. భేటీలో ఏం జరుగబోతుంది… ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..? బెత్తం దెబ్బల సౌండ్ వినిపిస్తుందా? అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందా? లేక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇలాగే వర్థిల్లాలి అంటూ లైట్ తీసుకుంటుందా? ఇలా అనేక క్వశ్చన్‌మార్కులతో ఉత్కంఠ రేపుతోంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిట్టింగ్.
నేతల మధ్య వివాదాలు, సమస్యలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాన్చకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళి వివాదంపై విచారణ చేపట్టిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ.. దీనిపై పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇవాళ జరిగే సమావేశంలో దీనిపై రిపోర్ట్‌ను ఫైనల్ చేయనుంది. ఇప్పటికే కొండా మురళితో పాటు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల వాదనలు విన్న కాంగ్రెస్ క్రమశిక్షణ.. ఈ వ్యవహారంలో ఏ రకమైన నివేదిక ఇవ్వనుందనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. ఈ అంశంలో చాలా సీరియస్‌గా ఉండాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు.
మరోవైపు కొండా మురళి తీరును తాము భరించే పరిస్థితుల్లో లేమని.. ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు టీపీసీసీకి స్పష్టం చేశారు. జిల్లాలోని ఇతర నేతలంతా ఈ విషయంలో ఒక్క తాటిపై రావడంతో.. కొండా మురళి వ్యవహారంలో కాంగ్రెస్ నాయకత్వం ఏం చేయబోతోంది.. అంతకంటే ముందు క్రమశిక్షణ కమిటీ ఈ వివాదంపై ఎలాంటి నివేదిక ఇవ్వనుందనే అంశంపై జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
పార్టీలో చంద్రబాబు కోవర్టులున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన కామెంట్లు కాక రేపాయి. నేనన్నది కాంట్రాక్టర్లని, మనోళ్లని కాదు అని సంజాయిషీ ఇచ్చుకున్నా పార్టీకైన డ్యామేజ్ కంట్రోల్ కాలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి, దానం నాగేందర్ మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. మొన్నటి మీటింగ్‌లో బహిరంగంగా గొడవకు దిగేశారు కూడా. మరి.. డిసిప్లినరీ కమిటీ దీన్నెలా తీసుకోబోతోంది? మెదక్ జిల్లా పటాన్‌చెరులో పాత-కొత్త నేతల మధ్య తకరారు ముదిరి.. బజార్న పడింది. నీలం మధు, కాటా శ్రీను, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహీపాల్.. మూడు వర్గాల మధ్య గ్యాప్ పెరిగింది. దీనికి ఫుల్‌స్టాప్ పడుతుందా..? నేతల్ని పిలిచి మాట్లాడి సర్దిచెప్పి పంపుతారా? లేక సస్పెన్షన్ లాంటి సీరియస్ యాక్షన్లుండబోతున్నాయా? ఎటూ తేల్చలేక సమావేశం మళ్లీ వాయిదా పడుతుందా..? గాంధీభవన్‌లో ఇవాళ జరగబోయే మీటింగ్ సారాంశంపై కాంగ్రెస్ లోపలా వెలుపలా ఆసక్తికర చర్చయితే జరుగుతోంది.