Nallapareddy Prasanna Kumar Reddy: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పారిపోయానని కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఎక్కడకు పారిపోలేదని కావాలంటే ఇప్పుడే అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తనది నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్లడ్ అని.. భయమనేది తమ బయోడేటాలో లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

తనది నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి రక్తమని.. భయపడటమనేది తమ బయోడేటాలో లేదంటూ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నెల్లూరు వదిలి వెళ్లానని అనడం హాస్యాస్పదమని.. కావాలంటే ఇప్పుడైనా తనను అరెస్ట్ చేసుకోవచ్చంటూ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నెల్లూరులోని తమ ఇంటిపై దాడికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని..పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
జగన్ చిత్తూరు పర్యటన.. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు
మరోవైపు వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మహిళా సంఘాలు, కూటమి పార్టీలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సంఘీభావంగా నిలిచాయి. ఇదే సమయంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించిన ప్రసన్నకుమార్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కోవూరులో కూడా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది.
అయితే ఈ పరిణామాల తర్వాత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కనిపించకుండా పోవటంతో ఆయన పారిపోయారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే నెల్లూరులో విలేకర్ల సమావేశం నిర్వహించిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పారిపోయే ప్రసక్తే లేదని.. కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.