తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్త ఆలోచన ద్వారా హైదరాబాద్ నగరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు కేవలం రూ.5కే నాణ్యమైన, రుచికరమైన అల్పాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం నగరంలో మధ్యాహ్న భోజనాన్ని రూ.5కే అందిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లను.. ఇకపై ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’గా మారు చేస్తున్నారు. కొత్తగా ప్రారంభం కాబోయే ఈ క్యాంటీన్లలో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం ప్రత్యేక టిఫిన్ మెనూను సిద్ధం చేసింది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే మిల్లెట్ పదార్థాలు ప్రాధాన్యత పొందనున్నాయి. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారానికి ఆరు రోజుల పాటు విభిన్నమైన టిఫిన్లను అందించనున్నారు.
వారానికి మెనూ ఇలా:
1వ రోజు: మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
2వ రోజు: మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
3వ రోజు: పొంగల్, సాంబార్, చట్నీ
4వ రోజు: ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
5వ రోజు: పొంగల్, సాంబార్, చట్నీ
6వ రోజు: పూరీ (3), ఆలూ కూర్మా
ప్రతి టిఫిన్‌కి ఖచ్చితమైన పరిమాణాలను జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఉదాహరణకు ఒక్క మిల్లెట్ ఇడ్లీ – 45 గ్రాములు, సాంబార్ – 150 గ్రాములు, చట్నీ – 15 గ్రాములు. ఒక్క టిఫిన్‌కు సగటుగా రూ.19 ఖర్చవుతున్నప్పటికీ, ప్రజల నుంచి కేవలం రూ.5 మాత్రమే వసూలు చేస్తారు. మిగిలిన రూ.14ను ప్రభుత్వం భరించనుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి జీహెచ్ఎంసీ మొత్తం 139 చోట్ల కొత్త కంటైనర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.11.43 కోట్లు ఖర్చు చేయనున్నారు. పరిశుభ్రత, నాణ్యత, పౌష్టిక విలువల పరంగా ఈ క్యాంటీన్లలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించనున్నారు. ఈ పథకం ద్వారా తక్కువ ధరకే ఆరోగ్యకరమైన ఆహారం అందించి.. నగరంలోని పేదలు, మధ్య తరగతి ప్రజల ఆకలిని తీర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి