ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా మౌరవాన్ తహసీల్‌లోని బైజనాథ్ ఖేడా గ్రామంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. జూలై 6వ తేదీ మధ్యాహ్నం గ్రామానికి చెందిన యూసుఫ్ అనే రైతు పొలంలో మేకలు మేపుతోన్న కాపరులు అకస్మాత్తుగా మట్టిలో ఏదో మెరుస్తూ ఉండటాన్ని గమనించారు. దగ్గరగా వెళ్లి చూసేసరికి అవి పాత నాణేలుగా అనిపించాయి. అక్కడే పక్కనే పాత విగ్రహం ముక్కలు, ఇటుకల భాగాలూ కనిపించాయి. వెంటనే గ్రామస్థులు ఈ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పురాతత్వ శాఖ జోక్యం చేసుకొని.. అధికారికంగా ఆ పొలాన్ని అధీనంలోకి తీసుకుంది. అక్కడి చుట్టూ బ్యారికేడింగ్ వేసి ప్రజల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించారు.
ఈ ప్రాంతంలో పరిశోధనలు జపరిపేందుకు జూలై 11వ తేదీన లక్నో కేంద్రంగా పని చేసే పురాతత్వ శాఖ బృందం రంగంలోకి దిగింది. వారు ప్రాథమికంగా అక్కడి నేలపై కనిపించిన వస్తువులను పరిశీలించారు. వారి వివరాల ప్రకారం.. అనేక పాత నాణేలు అక్కడ ఉన్నాయి. ఇంకా ఇతర విగ్రహాల అవశేషాలు, ప్రాచీన ఇటుకలు గుర్తించారు. వీటన్నింటినీ లక్నోలోని ప్రభుత్వ పురావస్తు మ్యూజియంకు పంపారు. అక్కడ ముద్రాశాస్త్ర నిపుణులు వాటిని విశ్లేషించనున్నారు. “ఇవి ఒక పురాతన నాగరికతకు చెందినవిగా కనిపిస్తున్నాయి. అయితే అవి ఏ యుగానికి చెందినవో చెప్పాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది. మంగళవారం నాటికి విశ్లేషణ పూర్తవుతుందని ఆశిస్తున్నాం. ఆ తర్వాతే తవ్వకాలు, రక్షణ చర్యలపై నిర్ణయం తీసుకుంటాం” అని సహాయ పురావస్తు అధికారి డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.
ఈ అవశేషాలు వెలుగులోకి రాగానే గ్రామస్థులే కాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లోనూ పెద్ద ఉత్సాహం నెలకొంది. చరిత్ర పరంగా ఇదొక గొప్ప ఆవిష్కరణ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..