చైనాకు వెంట్రుకల ఎగుమతులపై నిషేధం విధించాలని ఏపీ ఛాంబర్స్ కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించింది. దేశంలోని హెయిర్ ఇండస్ట్రీని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకోవాలని ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు చంద్రబాబును కోరారు. అలాగే ఆలయాల నుంచి సేకరించే తలనీలాలను వేలంలో నమోదు చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ పరిశ్రమ ద్వారా పది లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

ప్రాసెస్ చేసిన జుట్టు లేదా వెంట్రుకలను నాన్ – రెమీ హెయిర్ అని పిలుస్తారు. విగ్గులు, ఇతర సౌందర్య అలంకరణ సాధనాల్లో వీటి వాడకం ఎక్కువ. దీంతో డిమాండ్ కూడా అధికంగా ఉంటోంది. గడిచిన 20 ఏళ్లల్లో ఈ నాన్ – రెమీ హెయిర్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని ఏపీ ఛాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు చెప్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో ఇండియన్ హ్యూమన్ హెయిర్ ఎక్స్‌టెన్షన్ అండ్ విగ్ ఇండస్ట్రీ మార్కెట్ విలువ రూ.8000 కోట్ల వరకూ ఉందని.. వచ్చే దశాబ్దం నాటికి ఈ మార్కెట్ విలువ రూ.30000 కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీని కాపాడటం కోసం చైనా సహా ఇతర దేశాలకు ముడి వెంట్రుకలు, నాన్ – రెమీ హెయిర్ ఎగుమతులను నిలుపుదల చేయించాలంటూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఏపీ ఛాంబర్స్) ప్రతినిధులు చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు.
వెంట్రుకలకు ఉన్న మార్కెట్, డిమాండ్ దృష్ట్యా భారత ఎగుమతిదారుల నుంచి చైనీయులు 2012 -13 వరకూ భారీగా వెంట్రుకలను దిగుమతి చేసుకున్నారని ఏపీ ఛాంబర్స్ చెప్తోంది. అయితే గత పదేళ్లుగా చైనీయుల వైఖరిలో మార్పు వచ్చిందని.. లీగల్‌గా కాకుండా ఇల్లీగల్‌గా అంటే దొంగచాటుగా నాన్ – రెమీ హెయిర్ స్మగ్లింగ్ చేస్తోందని ఏపీ ఛాంబర్స్ చెప్తోంది. మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల ద్వారా మానవ వెంట్రుకల అక్రమ రవాణా చేస్తోంది. ఆయా దేశాలలో బాల కార్మికులతో ముడి వెంట్రుకలను ప్రాసెస్ చేయించి.. పన్నుల నుంచి చైనా తప్పించుకుంటోందని ఏపీ ఛాంబర్స్ చెప్తోంది. 2022 మార్చిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వీటిపై నిషేధం విధించారని.. అయినప్పటికీ ఎగుమతులు కొనసాగుతున్నాయని ఏపీ ఛాంబర్స్ వాదన.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏలూరు జిల్లాలోని ఏలూరు, మాడేపల్లిలో ఎక్కువగా వెంట్రుకల వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారుగా పది లక్షల మందికి ఉపాధి అవకాశం లభిస్తోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని చైనా, ఇతర దేశాలకు ముడి వెంట్రుకల ఎగుమతులను నిషేధించాలని ఏపీ ఛాంబర్స్ సీఎం నారా చంద్రబాబు నాయుడును కోరింది. అలాగే ఆలయాల నుంచి సేకరించే తలనీలాలను వేలంలో నమోదు చేసుకున్న ఎగుమతిదారులకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయాలని కోరింది. చైనీస్ ఏజెంట్లు, అక్రమ వ్యాపారులకు ఇందులో ప్రవేశం లేకుండా చూడాలని ఏపీ ఛాంబర్స్ విజ్ఞప్తి చేసింది. మనదేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కలిగిన దేశాలకు వెంట్రుకల ఎగుమతులపై సుంకాలను తగ్గించాలని.. ఆఫ్రికన్ దేశాలకు జుట్టు, విగ్‌లను ఎగుమతి చేసే వారికి ప్రోత్సాహకాలు అందించాలని కోరింది.