దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు సామాజికంగా, ఆర్థికంగా స్వావలంబిగా మారేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. వ్యవసాయం, సేవా రంగాలు, స్వయం ఉపాధి పరిశ్రమల ద్వారా వారికీ జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పునరావాస పథకాలను చేపట్టింది. దివ్యాంగులు సాధారణంగా జీవించేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక సబ్సిడీ పథకం అందిస్తోంది. కరీంనగర్ జిల్లాలో 21 యూనిట్లు మంజూరయ్యాయి.
పథకం సబ్సిడీ వివరాలు..
పథకం వివరాల విషయానికి వస్తే… బ్యాంకు లింకేజీ అవసరం లేకుండానే 100 శాతం సబ్సిడీతో రూ.50,000, 80 శాతం సబ్సిడీతో రూ.1,00,000, 70 శాతం సబ్సిడీతో రూ.2,00,000, 60 శాతం సబ్సిడీతో రూ.3,00,000 వరకు లోన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ పథకం కోసం జూలై 14 నుండి 31, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఈ లింక్ ను https://tgobmms.cgg.gov.in సందర్శించండి.
పథకానికి అర్హతలు..
అర్హతల విషయానికి వస్తే కనీసం లబ్ధిదారులకు 40% దివ్యాంగత్వం ఉండాలి. వయసు 21 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు లోపు, పట్టణాల్లో రూ.2 లక్షలు లోపుగా ఆదాయ పరిమితి నిర్దేశించారు. గత 5 సంవత్సరాల్లో ఏ ఇతర ప్రభుత్వ సబ్సిడీ తీసుకోకుండా ఉండాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం, జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.
నిరుద్యోగ ట్రాన్స్‌జెండర్ల కోసం నైపుణ్య శిక్షణ..
మరోవైపు నిరుద్యోగ ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు ప్రభుత్వం వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ కల్పించనుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్, ఫోటోగ్రఫీ & వీడియో గ్రాఫీ, బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్ టైలరింగ్, లాజిస్టిక్స్ & సప్లై చైన్ వంటికి కోర్సులను నేర్పించేందుకు ప్రభుత్వ చర్యలు చేపట్టింది. వీటిలో శిక్షణ పూర్తయిన తర్వాత ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. జూలై 23,2025తో వీటి దరఖాస్తు తేదీ ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ ట్రాన్స్‌జెండర్లకే ఈ అవకాశం ఉంటుంది. సంబంధిత శిక్షణపై ఆసక్తి, ప్రాథమిక అర్హత ఉండాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.