మాటలో విరుపున్నా.. కంటితో నిప్పులు కురిపించాలన్నా.. మనసు నిండిన ఆనందం పండాలన్నా… భావోద్వేగాలతో కన్నీటి పర్యంతం కావాలన్నా… పొరుగింటి పుల్లయ్య, ఎదురింటి ఎల్లయ్య.. పల్లెటూరి పెద్ద, పట్నంలో పిసినారి, మధ్యతరగతి మనిషి, కొడుకు కోసం తపించే తండ్రి, వారసుడి కోసం కలలు కనే ఇంటి పెద్ద… సందర్భం ఏదైనా, ఆ పాత్రలో కోట ఉంటే డైరక్టర్ బేఫికర్‌గా ఉండొచ్చనే క్రెడిట్‌ని సొంతం చేసుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. ఇవాళ 750 ప్లస్ సినిమాలతో కోట శ్రీనివాసరావు నవరసనటనానుభవాన్ని గొప్పగా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ నెమరేసుకునే సినిమాల్లో కొన్ని మైలురాళ్లున్నాయి. వాటిలో ప్రాణం ఖరీదు సినిమాకి ప్రాధాన్యం ఉంది. అందులో ఆయన చేసింది చాలా చిన్న కేరక్టర్. బాబయ్య అనే పాత్రలో కనిపించారు కోట శ్రీనివాసరావు. ఇతనిలో స్పార్క్ ఉందని డైరక్టర్ల దృష్టిలో పడేలా చేసింది ఆయన చేసిన బాబయ్య కేరక్టర్.
తెలుగు సినిమా చరిత్రలో ప్రతిఘటన గురించి ఎవరు మాట్లాడుకున్నా… ఆ సినిమాలో వడ్డి కాసు సుబ్బయ్యగా కోట శ్రీనివాసరావు చేసిన కేరక్టర్‌ని మర్చిపోలేరు. తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగులు, పలికించిన రౌద్రం, అడుగు అడుగున కనిపించిన క్రూరత్వం.. ఆయన కేరక్టర్‌ని చిరస్థాయిగా నిలిపాయి. ప్రతిఘటన విడుదలయ్యాక కోట శ్రీనివాసరావు బయట కనిపిస్తే.. ఆయన్ని కోపంగా చూసిన మహిళలు కోకొల్లలట. తెరమీద ఆయన పలికించిన క్రూరత్వానికి అంతగా కనెక్ట్ అయ్యారు జనాలు.

Aha Na Pellanta
కోట శ్రీనివాసరావు పేరు చెప్పగానే ఎవరికైనా చటుక్కున గుర్తుకొచ్చే మరో కేరక్టర్ అహనాపెళ్లంటలో లక్ష్మీపతి కేరక్టర్. జనరేషన్స్ దాటి లక్ష్మీపతిని గుర్తుచేసుకుంటుంటారు తెలుగు వారు. ఆయన కామెడీ టైమింగ్‌కి, డైలాగ్ డెలివరీకి తిరుగులేదని మరోసారి గ్రాండ్‌గా ప్రూవ్ చేసిన కేరక్టర్ లక్ష్మీపతి.
శివ సినిమాను రామ్‌గోపాల్ వర్మ, నాగార్జున మాత్రమే కాదు.. కోట శ్రీనివాసరావు కూడా మర్చిపోరు. సందర్భం వచ్చిన ప్రతిసారీ శివ మూవీని గుర్తుచేసుకునేవారు కోట శ్రీనివాసరావు. వర్మ తన వ్యావహారిక శైలిని స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన తీరును తలచుకుని మురిసిపోయేవారు. తెలుగు సినిమాలో సరికొత్త విలనిజాన్ని వర్మ పరిచయం చేశారని చెప్పుకునేవారు. ఈ మాటలు కోట శ్రీనివాసరావువి మాత్రమే కాదు… శివ సినిమాను గుర్తుచేసుకునే తెలుగు ప్రేక్షకులవి కూడా.

Kota Srinivasa Rao, Venkate
వెంకటేష్‌తో నేనేం చేసినా సూపర్ హిట్టే. తనతో నేను చేసిన కేరక్టర్లన్నీ మెప్పించాయి అని మనస్ఫూర్తిగా చెప్పుకునేవారు కోట శ్రీనివాసరావు. ముఖ్యంగా శత్రువు సినిమా సమయంలో తమ మధ్య మంచి అసోసియేషన్ ఏర్పడిందని అనేవారు. శత్రువు సినిమాలో రామన్న కేరక్టర్ ‘థాంక్స్.. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళిలో లక్ష్మీబాంబులాగా పేలిపోయాడు..’ అంటూ ఆ సినిమాలో కోట పలికిన డైలాగులు ఇప్పటికీ చాలా మందికి గుర్తున్నాయి. రామన్న కేరక్టరా? మజాకా? అని మాట్లాడుకుంటున్నవారు కోకొల్లలు.
జీవితానుభవం, నటనలో నేర్చుకున్న మెలకువలు, పాత్రల నాడి పట్టుకునే తీరు ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నది ఇండస్ట్రీ ప్రముఖులందరూ ముక్తకంఠంతో చెప్పేమాట. తాను కలిసి పనిచేసిన నటుల్లో ఇలాంటి వ్యక్తిని చూడలేదని పదే పదే చెప్పేవారట సౌందర్య. అందుకే కోట శ్రీనివాసరావు ఎక్కడ కనిపించినా పాదాభివందనం చేసేవారట.

Mamagaru
కోటతో సౌందర్య సన్నివేశాలనే కాదు, గాయంలో రేవతి- కోట మధ్య జరిగిన సంభాషణలనూ మర్చిపోరు జనాలు. ‘గదైతే నేను ఖండిస్తున్నా.. ఏమి యాక్షన్ తీసుకుంటం.. పోలీసోళ్లకు చెప్పినం..’ అంటూ గాయం సినిమాలో గురునారాయణ చెప్పిన మాటల్ని కూడా మర్చిపోలేరు జనాలు. ఆయన ‘ఖండిస్తున్నం..’ అని చెప్పిన ప్రతిసారీ అదో మేనరిజం అయింది. అప్పట్లో ఎవరేం మాట్లాడినా ఖండిస్తున్నం.. అని ఒకరితో ఒకరు అనుకోవడం సొసైటీలో ప్రాచుర్యం పొందింది. గాయంలో రేవతి, కోట శ్రీనివాసరావు మధ్య వచ్చే సన్నివేశాలు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.
గాయంలో ఖండిస్తున్నం అని మెప్పించిన కోట.. గోవింద గోవిందలో సర్పంచ్ కేరక్టర్‌లో మాత్రం చాలా ఇష్టంగా చేశారు. ఓ వైపు ఆయన మాటలు నవ్వులు తెప్పించినా.. వెంటనే సీరియస్‌నెస్‌ని చూపించి బ్యాలన్స్ చేశారు. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో గోవింద గోవింద ఒకటి…
కోట శ్రీనివాసరావు ఇక లేరన్న వార్త విన్నవారు హలో బ్రదర్‌లో ఆయన కేరక్టర్‌ని ఇమీడియేట్‌గా గుర్తుచేసుకున్నారు. ఓ వైపు కామెడీ, ఇంకో వైపు సెంటిమెంట్…. కోట చేసిన సుబ్బారావు పాత్రను జీవితకాలం గుర్తుపెట్టుకుంటామంటున్నారు ఫ్యాన్స్.
ఆమె సినిమా గుర్తున్నవారికి కోట కేరక్టర్‌ని స్పెషల్‌గా పరిచయం చేయక్కర్లేదు. పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ లో కోట శ్రీనివాసరావు పేరును పదిలం చేసిన కేరక్టర్ అది. ఆయన నటనలోని సహజత్వానికి ముగ్ధులయ్యారు ఆడియన్స్. పేస్టును ఎలా వాడుకోవాలో కోట చెప్పిన తీరును ఇప్పటికీ పొద్దున్నే గుర్తుచేసుకునేవారు కోకొల్లలు. అంతగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది ఈ మూవీ.
సినిమాలు వస్తున్నాయి కదా.. అని ఎప్పుడూ మూస ధోరణిలో అడుగులు వేయలేదు కోట శ్రీనివాసరావు. విలక్షణమైన కేరక్టర్లని సెలక్ట్ చేసుకున్నారు. అందుకు అత్యంత పెద్ద ఉదాహరణ లిటిల్ సోల్జర్స్. అందులో ఆయన చేసిన మేజర్ హరిశ్చంద్ర ప్రసాద్ రోల్ ఓ ఎగ్జాంపుల్. ఎదురుగా సమ ఉజ్జీలు ఉన్నప్పుడు చాలెంజింగ్‌గా నటించే కోట, చిన్న పిల్లలతో సరదాగా చేసిన సన్నివేశాలు, వాళ్ల స్థాయికి తనను తాను తగ్గించుకుని నటించిన తీరు అమోఘం.
కోట లేరన్న వార్త విని తెలుగు లోగిళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంత గొప్ప నటుడు ఈ కాలంలో ఇంకెవరున్నారని వెతుకులాట మొదలైంది పొరుగు పరిశ్రమల్లో. మన దగ్గరే కాదు… పొరుగు భాషల్లోనూ నటించిన మెప్పించిన పాన్ ఇండియా ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు. మరి ఆయన్ని జనాలకు అంత దగ్గర చేసిన కేరక్టర్లు ఏవి….
క్రైమ్ థ్రిల్లర్లు ఇప్పుడేం చూశారు.. అప్పట్లో అనగనగా ఒక రోజును చూడాల్సింది అంటూ కోట శ్రీనివాసరావు చాలా సందర్భాల్లో చెప్పేవారు. అనగనగా ఒక రోజులో చేసిన రామకృష్ణ కేరక్టర్ తనకు ఫేవరేట్ అని చెప్పుకునేవారు. ఆ సినిమాలో డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ తనకు చాలా ఇష్టమని అనేవారు.
ఇవన్నీ ఒక ఎత్తు.. గణేష్‌లో చేసిన కేరక్టర్ ఇంకో ఎత్తు.. రాజకీయ నేపథ్యంలో వచ్చిన విలన్ రోల్ అది. కథ విన్నప్పుడే సూపర్‌గా అనిపించింది. స్క్రీన్ మీద ఆ రోల్‌ని ఇప్పటికి చూసినా ఏదో గొప్పగా, గర్వంగా అనిపిస్తుందని చాలా సందర్భాల్లో గణేష్ గురించి చెప్పేవారు కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమాల విలన్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గణేష్ మూవీలో కోట శ్రీనివాసరావు రోల్‌ని అసలు ఎవరూ మర్చిపోకూడదు. అలాగే చిన్నాలోనూ ఆయన రోల్ గుర్తుండిపోతుంది.
ఈ తరానికి ఇడియట్ సినిమా ఓ మంచి జ్ఞాపకం. ఇడియట్‌లో ఆయన నటించిన రమణ రోల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతగా యూత్‌కి కనెక్ట్ అయింది ఆ రోల్. హీరో కేరక్టర్ ఎలివేట్ కావాలంటే, సినిమాలో ఇలాంటి రోల్స్ ఉండి తీరాల్సిందేనని ఇప్పటికీ ప్రత్యేకమైన విశ్లేషణలు ఇస్తుంటారు క్రిటిక్స్.
సినిమాల్లో కోట చేసిన కేరక్టర్లే కాదు.. ఆయన కేరక్టర్లకు పెట్టే పేర్లు కూడా విలక్షణంగా అనిపించేవి. మల్లీశ్వరిలో బావాజీగా మెప్పించారు కోట శ్రీనివాసరావు. మల్లీశ్వరి మూవీని, కోట చేసిన కేరక్టర్‌ని గుర్తుచేసుకుంటారు మూవీ లవర్స్.
మామూలుగా కమర్షియల్ సినిమాల్లో కేరక్టర్లు చేసేయడం వేరు.. తన నటనతో సినిమాలను కమర్షియల్ సక్సెస్‌లు చేయడం వేరు. అలా రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో కలికితురాయి ఆ నలుగురు సినిమా. ఇందులో కోట శ్రీనివాసరావు కేరక్టర్ చాలా స్పెషల్. ఆ నలుగురిని గుర్తుపెట్టుకున్నన్ని రోజులు.. రాజేంద్రప్రసాద్‌తో పాటు కోట శ్రీనివాసరావు కేరక్టర్‌ని కూడా గుర్తుంచుకుంటారు జనాలు. నా చేతిలో డబ్బెట్టు.. నీచేత్తో మీ నాన్న చితికి నిప్పెట్టు.. అంటూ ఇచ్చిన డబ్బును వసూలు చేసే నిఖార్సైన వ్యాపారిగా కనిపించారు కోట శ్రీనివాసరావు.
స్టార్ హీరోల సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అతడుని ఎలా మర్చిపోతాం.. అందులో బాజిరెడ్డిగా కోట శ్రీనివాసరావుని ఎలా మర్చిపోతాం. త్రివిక్రమ్ శ్రీనివాసరావు సినిమాలంటే కోట శ్రీనివాసరావుకి ప్రత్యేకమైన అభిమానం. అత్తారింటికి దారేదిలో తనతో రాయలసీమ యాసను శ్రీను పలికించాడని పదే పదే చెప్పుకుని మురిసిపోయేవారు కోట.
ప్రభాస్ ఛత్రపతిలో కోట శ్రీనివాసరావు రోల్‌ని మర్చిపోతారా జనాలు… ఓరి నాయనో.. ఓరినాయనో అంటూ ఛత్రపతిలో కోట నటన అద్భుతం. ఓ వైపు పేషెంట్ సీరీయస్‌గా ఉన్నారని, డాక్టర్ చెబుతుంటే, మరోవైపు హాస్పిటల్ నుంచి కోట వెళ్లిపోయే దృశ్యాలు రిపీట్ మోడ్‌లో చూస్తుంటారు జనాలు.
ఒన్లీ విలనేనా అంటే.. కానే కాదు.. బిడ్డల కోసం తపించే తండ్రి కేరక్టర్‌లో కోట శ్రీనివాసరావు చేసినన్ని కేరక్టర్ల వేరియేషన్స్ ఇంకెవరూ చేయలేదంటే అతిశయోక్తి కాదేమో… కన్న బిడ్డకు స్వేచ్ఛనిచ్చి, ఎక్కడ అదుపు చేయాలో తెలిసిన వ్యక్తిగా ఆయన బొమ్మరిల్లు లో చేసిన కేరక్టర్‌కి ఫిదా అయ్యారు జనాలు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులో వెంకటేష్, కోట శ్రీనివాసరావుల మధ్య వచ్చిన సన్నివేశాలు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతుంటాయి. వయసు మీద పడిన తర్వాత కొడుకుల దగ్గర కొన్నాళ్ల పాటు ఉండాల్సిన తండ్రి కేరక్టర్లో బృందావనం మూవీలో కోట శ్రీనివాసరావు ఒదిగిపోయారు. తాను ఒక కొడుకు దగ్గర పోతే.. ఇంకో కొడుకు వచ్చి చూస్తాడో లేడో అని ఓ తండ్రి పడే ఆవేదనకు జనాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతగా భావోద్వేగాన్ని పండించి మనసులకు దగ్గరైంది కోట నటన. ఈ సినిమాలేనా? గబ్బర్ సింగ్‌లో సిద్ధప్ప నాయుడుగా ఆయన నటన మామూలుగా ఉంటుందా?
ఇలా చెప్పుకుంటూ పోతే కోట నటన గురించి, ఆయన చేసిన ప్రతి పాత్రా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ పోవచ్చు. తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుంటారు కోట. ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, పాత్రను అర్థం చేసుకున్న తీరు, అందులో ఆయన ఒదిగిపోయిన వైనం.. ప్రతిదీ తెలుగు సినిమా చేసిన అదృష్టం. అలాంటి నటులు మళ్లీ మళ్లీ కనిపించకపోవచ్చన్నది ఇండస్ట్రీ ప్రముఖుల నోట వినిపిస్తున్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమాపై చెరగని సంతకం కోట శ్రీనివాసరావుది.