పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ లో గ్రూప్ వార్ తరాస్థాయికి చేరింది. ఝాన్సీ రెడ్డి, తిరుపతి రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు రాజుకున్నాయి. తాజాగా తొర్రూర్ మండలం చర్లపాలెం గ్రామంలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరుపతిరెడ్డి వర్గీయులు టెంట్లు కూల్చివేసి కుర్చీలు ధ్వంసం చేశారు. చెర్లపాలెం గ్రామానికి చెందిన తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డిని పిలవకపోవడంతో తిరుపతి రెడ్డి వర్గం భగ్గుమంది. చిన్నమ్మ ఝాన్సీరెడ్డి మరియు తిరుపతిరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
గ్రామాల్లో స్థానిక సమరం షురూ అయ్యింది. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు ఆవేశానికి లోనవుతున్నారు. కుర్చీలు గాల్లోకి లేస్తున్నాయి.. టెంట్లు, షామియానాలు.. కూలుతున్నాయి. అంతర్గత విబేధాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు అనుచరులు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో కొద్ది రోజులుగా పార్టీ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరెడ్డి, సీనియర్ నేత, తొర్రూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది.
పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి బదులుగా ఆమె అత్తగారు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీరెడ్డి ఆధిపత్యం శృతి మించుతోందని తిరుపతిరెడ్డి కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. పాలకుర్తిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శిచారు. ఈ క్రమంలో ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు తాజాగా గర్షణ పడటం రాజకీయంగా సంచలనంగా మారింది.