విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో టాలీవుడ్ సినీపరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల సినీప్రయాణంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. సహజ నటనతో అనేక పాత్రలకు ప్రాణం పోసి కోట్లాది మంది సినీప్రియుల మనసులు గెలుచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 750కి పైగా సినిమాలు.. ఎన్నో విలక్షణ పాత్రలు.. మరెన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని.. ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాస్వతంగా నిలిచిపోతాయని అన్నారు. కోట శ్రీనివాస రావు పార్థివదేహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు.