ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) కీలక ప్రకటన చేసింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న 832 మంది ఇంటర్ విద్యార్థులకు రాష్ట్రపతి వైశిష్ట్యాధికార నిధి ద్వారా మొత్తం రూ 62.40 లక్షలు విడుదల చేసినట్లు తెలిపింది. ఈ సహాయాన్ని విద్యలో ప్రతిభ కనబర్చిన ఆదివాసీ విద్యార్థులను ఉత్తేజపరిచే ఉద్దేశంతో రాష్ట్రపతి మంజూరు చేశారు. 2024–25 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు రాసిన ప్రతి ఈఎంఆర్‌ఎస్ నుంచి సైన్స్, కామర్స్, హ్యూమానిటీస్ విభాగాల్లో టాపర్లు ఇద్దరిని ఎంపిక చేశారు.ఈ విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రూ 7,500 చొప్పున ఒక్కసారిగా ఆర్థిక సహాయం అందింది.
విద్యార్థుల ఎంపిక ప్రతిభ ఆధారంగా జరిగింది. నిధులు నేరుగా విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యాయి. దీనివల్ల పారదర్శకత, వేగవంతమైన పంపిణీ సాధ్యమైంది. కొన్ని సందర్భాల్లో అనేక మంది విద్యార్థులు సమాన మార్కులు, ర్యాంకులు సాధించిన నేపథ్యంలో 10 ఈఎంఆర్‌ఎస్‌లకు చెందిన 20 మంది విద్యార్థుల మధ్య టై బ్రేకర్ నియమాలు వర్తింపజేశారు. ముందుగా బాలికలకు ప్రాధాన్యత ఇవ్వగా.. ఇంకా సమానత ఉంటే ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులు ఆధారంగా తుది ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడమే కాకుండా, ఆదివాసీ యువతలో నైపుణ్యాలను వికసింపజేసే లక్ష్యాన్ని రాష్ట్రపతి పంచుకుంటున్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.