Sitanagaram Talliki Vandanam Money To Father: తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు వింత కోరికతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం విడుదల చేసిన ‘తల్లికి వందనం’ డబ్బులు తమ తల్లికి కాకుండా తండ్రికి ఇవ్వాలని వారు కోరుతున్నారు. కారణం వారి తల్లిదండ్రులు విడిపోయి ఉండటమే. కాలు పనిచేయకపోయినా తమ తండ్రి తమను పోషిస్తున్నాడని, ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడతాయని వారు ఎంపీడీవోను వేడుకున్నారు. మరి ఈ విచిత్ర పరిస్థితికి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
హైలైట్:
- తల్లికి వందనం డబ్బులు తండ్రికి ఇవ్వండి
- మా అమ్మకు తల్లికి వందనం డబ్బులివ్వొద్దు
- ఎంపీడీవోను కలిసి వినతి పత్రం ఇచ్చారు

తమ తండ్రి చిత్రపు అబ్బులు, అలాగే తల్లి కొన్ని కారణాలతో విడిపోయి ఉంటున్నారని అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. అప్పటి నుంచి తాము తండ్రి సంరక్షణలో ఉంటున్నామన్నారు. కాలు పనిచేయకపోయినా సరే తన తండ్రి ఉపాధి పనులు చేసుకుంటూ తమ ఇద్దర్నీ చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం డబ్బులు తమ తల్లి ఖాతాలో పడుతున్నాయని గుర్తు చేశారు.. ఆ డబ్బులు తమ తల్లి తీసుకుందంటున్నారు.
Thalliki vandanam status check: తల్లికి వందనం రాలేదా, అకౌంట్లో డబ్బులు పడలేదా, ఏం చేయాలంటే?
తమకు స్కూల్లో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం, బుక్స్, యూనిఫామ్ వంటి సౌకర్యాలతో చదువుకోగలుగుతున్నామన్నారు అక్కాచెల్లెళ్లు సంధ్యన, సునైనా. తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న పూరి పాకలో వర్షం వస్తే నీరు కారిపోయే స్థితిలో ఉంటూ చదువుతున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బులు తమ తండ్రికి ఇస్తే తమ అవసరాలు తీర్చుకుంటామని చెప్పినా తమ తల్లి వినడం లేదన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి.. తల్లి పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ నిలిపివేయాలని కోరారు. తమను కంటికి రెప్పలా చూసుకుంటున్న తమ మంత్రి పేరున తల్లికి పథకం వర్తింపజేయాలని కోరారు. వీరిద్దురు ఎంపీడీవో కార్యాలయంలో మాత్రమే కాదు పీజీఆర్‌ఎస్, సీతానగరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఈ అంశంపై మరో వినతిపత్రం అందజేశారు. మరి ఈ అక్కాచెల్లెళ్ల సమస్యను ప్రభుత్వ అధికారులు ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తల్లికి వందనం డబ్బుల్ని తల్లికి కాకుండా తండ్రి అకౌంట్‌లో వేయమని కోరవడం చర్చనీయాంశమైంది.