
పక్షవాతంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో అద్భుతమైన చికిత్స అందించారు. కేవలం గంటలో ఆమె తిరిగి కాళ్లు, చేతులు కదిలించగలిగే స్థితికి చేరుకున్నారు. పెదవేగికి చెందిన 60 ఏళ్ల వెంకటేశ్వరమ్మ ఈ నెల 12వ తేదీ ఉదయం కుడికాలు, కుడిచేయి బిగిసిపోయిన లక్షణాలతో ఆస్పత్రికి తీసుకువచ్చారు. తక్షణమే స్ట్రెచర్‌పై అత్యవసర విభాగానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు ఆమెకు పక్షవాతం వచ్చిందని నిర్ధారించారు. లక్షణాలు బయటపడిన నాలుగు గంటల్లో థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కోలుకునే అవకాశముందని భావించి వెంటనే రూ.30-40 వేల విలువ చేసే ఆ ఇంజెక్షన్‌ను ఇచ్చారు.
డాక్టర్ విద్యాసాగర్ పర్యవేక్షణలో జూనియర్, పీజీ వైద్యులు చికిత్స చేశారు. గంటలోపే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. సాయంత్రానికి తానే లేచి నడవగలిగినంత స్థాయిలో కోలుకుంది. ఇంతకుముందు ఇలాంటి కేసులను గుంటూరుకు రిఫర్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఏలూరు బోధనాసుపత్రిలో న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ అందుబాటులో ఉండటంతో… ఇప్పుడు స్థానికంగానే స్ట్రోక్ రోగులకు పూర్తి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిపై స్థానిక ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.