Tirumala Gold Dollars Case,తిరుమల శ్రీవారి బంగారు డాలర్ల కేసు.. 15మంది టీటీడీ అధికారులకు ఊరట.. 2006నాటి కేసు, కీలక ఉత్తర్వులు – andhra pradesh government orders on tirumala missing gold dollar case
Tirumala Gold Dollars Case Ap Govt Orders: టీటీడీలో బంగారు డాలర్ల మాయం కేసులో ఊహించని మలుపు! 2006లో చోటుచేసుకున్న ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది అధికారులపై చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. విచారణలో అభియోగాలు రుజువు కాకపోవడంతో దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ డాలర్లు ఏమయ్యాయి? అధికారులకు ఊరట ఎలా దక్కింది? ఈ కేసులో డాలర్ శేషాద్రి పాత్ర ఏమిటి? అసలు నిజాలు వెలుగులోకి వస్తాయా?
హైలైట్:
తిరుమల బంగారు డాలర్ల కేసుపై కీలక ఉత్వర్వులు
15 మంది అధికారులపై తదుపరి చర్యలు నిలిపివేత
2006లో సంచలనంగా మారిన బంగారు డాలర్ల కేసు
తిరుమల బంగారు డాలర్ల కేసు (ఫోటోలు– Samayam Telugu)
టీటీడీలో బంగారు డాలర్ల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది అధికారులపై తదుపరి చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. 2006లో 5 గ్రాముల బరువున్న 300 బంగారు నాణేలు (డాలర్లు) దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి 2008లో నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో రూ.15.40 లక్షల విలువైన డాలర్ల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.. ఆ తర్వాత సంబంధిత అధికారులపై అభియోగాలు నమోదు చేశారు. ప్రభుత్వం కేసును సీబీసీఐడీకి అప్పగించింది.. వారు కూడా దర్యాప్తు చేసి నివేదికను సమర్పించారు. విజిలెన్స్, సీబీసీఐడీ నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంబంధిత ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఈ బాధ్యతను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించింది. మొదట ఈ కేసును సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సుభ్రేంద్రు భట్టాచార్యకు అప్పగించారు. ఆ తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జె.సత్యనారాయణకు అప్పగించారు. కేసు విచారణను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించారు. అయితే విచారణలో అభియోగాలు రుజువు కాలేదని తేలింది.. తాజాగా తదుపరి చర్యలు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ ఈవోలు, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు సహా పలువురికి ఊరట దక్కింది. ఊరట దక్కిన వారిలో ఆర్ ఉమాపతి, ఆర్ రఘునాథాచారి, ఎన్ చెంచులక్ష్మి, కె చిత్తరంజన్, ఎస్ గజపతి, కె గోవర్ధన్, ఇ రామచంద్రారెడ్డి, ఏ రఘురామిరెడ్డి, ఎం చంద్రశేఖరరెడ్డి, ఏవీ రమణమూర్తి, ఎం వెంగన్న, పీ ఆంజనేయులు, బి మల్లికార్జునమూర్తి, బీఆర్ గురురాజారావు, రావినూతల శ్రీరామ్‌లు ఉన్నారు. ఈ డాలర్ల కేసులో టీటీడీ ఆలయ ఓఎస్డీగా పనిచేసిన డాలర్ శేషాద్రిపై కూడా అభియోగాలు నమోదయ్యాయి.. అయితే ఆయన 2021లో చనిపోయారు. మొత్తం మీద డాలర్ల కేసులో 15మందికి ఊరట దక్కింది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి