జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో కొండచరియలు విరిగిపడి రామ్‌నగర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) రాజిందర్ సింగ్, అతని కుమారుడు మరణించారు. SDM రాజిందర్ సింగ్, అతని కుటుంబం బొలెరో వాహనంలో ధర్మరి నుండి వారి స్వస్థలమైన పట్టియాన్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వారు ప్రయాణిస్తున్న వాహనంపై సలుఖ్ ఇఖ్తర్ నల్లా సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి.. ఈ సంఘటనలో రాజిందర్ సింగ్, అతని కుమారుడు గాయపడి అక్కడికక్కడే మరణించగా, అతని భార్య, ఇద్దరు బంధువులు గాయపడ్డారు.
స్థానిక నివాసితులు, పోలీసుల సహాయంతో హుటాహుటినా సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత, పరిస్థితి విషమంగా ఉన్న వారిని రియాసిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
వీరి మరణం పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటల్ డల్లూ కూడా ఈ మరణాలపై విచారం వ్యక్తం చేశారు. రాజిందర్ సింగ్ నిజాయితీగల అధికారి అని, సహోద్యోగులు, సమాజం ఆయనను గౌరవించారని ఆయన పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వమే పూర్తి సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..