చియా సీడ్స్.. బరువు తగ్గటానికి చాలా మంది చియా సీడ్స్ తింటుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ చిన్న విత్తనాలు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చియా సీడ్స్‌ను వాటర్‌లో వేస్తే జెల్ మాదిరి అవుతాయి. ఇవి పేగులను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ పేగులు క్లీన్ అవ్వాలంటే చియా సీడ్స్ నానబెట్టిన వాటర్ తాగడం మంచిది.
చియా సీడ్స్ తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవచ్చు. ఇది ఆకలి, దాహాన్ని ఎక్కువగా కలిగించదు. తద్వారా అతిగా తినడం అరికట్టవచ్చు. డైట్‌లో ఉన్నప్పుడు మిల్క్‌షేక్‌లో వేసుకుని తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చియా విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా దొరుకుతుంది. దీనిని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఎముకలకు మంచిది.
చియా సీడ్‌ను రోజూ తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది, దాని వల్ల ఎటువంటి సమస్య ఉండదు. చియా విత్తనాలను నేరుగా తీసుకోవడం కంటే రసంలో తీసుకోవడం ఉత్తమం. ఇందుకోసం మీరు ఒక రోజులో 2-3 స్పూన్ల చియా విత్తనాలను ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.
అయితే, ఏదైనా అతిగా తినటం వల్ల అనర్థాలు తప్పవని అంటారు. అలాగే, చియా విత్తనాలను కూడా ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, కడుపుబ్బరం సమస్యలు వస్తాయి. తక్కువ రక్తపోటు ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా వారి రక్తపోటు మరింత తగ్గవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.