Free bus Travel Scheme in Andhra Pradesh: ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో పథకాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని 74 శాతం బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డుల సాయంతో ఐదు రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. మరోవైపు ఉచిత బస్సు పథకం పేరు ఏమిటనే దానిపై సస్పెన్స్ వీడింది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ పేరు చెప్పేశారు..

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పేరును బయటపెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. స్త్రీశక్తి పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చన్న సీఎం.. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని రూ.2.62 కోట్ల మంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందన్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణం.. ఈ బస్సులలోనే..
మహిళా సాధికారతను ప్రోత్సహించడంతో పాటుగా మహిళలకు ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం అమలుతో ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలోని 74 శాతం బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 11,449 బస్సులు ఉన్నాయి. వీటిలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నారు. మొత్తం బస్సులలో వీటి వాటా 8,548 (74 శాతం) అని అధికారులు చెప్తున్నారు వీటితో పాటుగా విద్యార్థుల కోసం నడుపుతున్న బస్సులు, డిపోలలో స్పేర్ కింద ఉన్న బస్సులను కూడా ఉచిత బస్సు పథకం కోసం నడపనున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – కావాల్సిన గుర్తింపు పత్రాలు
మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించాలంటే గుర్తింపు కార్డులు తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి అని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. దీని ప్రకారం ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి వాటితో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు. ఈ పథకం కింద రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వీలుంది. ఇందులో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. ఈ జీరో ఫేర్ టికెట్లలో ప్రయాణానికి సంబంధించిన వివరాలు, పథకం అమలుతో ఎంత డబ్బులు ఆదా అయ్యాయనే వివరాలు ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా మహిళలు అందరికీ ఉచిత బస్సు పథకం వర్తిస్తుంది.
అమరావతిని సింగపూర్ చేయడమే చంద్రబాబు ధ్యేయం.. అదే పర్యటన ఉద్దేశం: రాంప్రసాద్ రెడ్డి
ఉచిత బస్సు పథకం- వర్తించని బస్సులు
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొన్ని బస్సులలో వర్తించదు. సూపర్ లగ్జరీ, ఏసీ, గరుడ, అమరావతి వంటి ప్రీమియం బస్సులకు ఈ పథకం వర్తించదు.ఈ విషయాన్ని మహిళలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఈ పథకం వర్తించదు. అంటే వేరే రాష్ట్రాలకు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండదు. ఉచిత బస్సు పథకం అమల్లో ఉండే బస్సులలో భార్యాభర్తలు కలిసి ప్రయాణిస్తే భర్తకు ఛార్జీ ఉండే టికెట్, అలాగే భార్యకు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు ప్రకటిస్తారు.