
అమరావతి, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలు ఎట్టకేలకు తాజాగా విడుదలయ్యాయి. మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో నాటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 22న వీరికి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 4.59 లక్షల అభ్యర్ధులు హాజరయ్యారు. ఇందులో 91,507 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు 2024 డిసెంబర్‌లో నిర్వహించారు. ఇక ఇందులోనూ అర్హత సాధించిన 37,600 మంది అభ్యర్థులకు జూన్ 1, 2025న తుది రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత శుక్రవారం ఉదయం (ఆగస్టు 1) విడుదల చేశారు.
పోలీస్ శాఖలో ఉన్న సిబ్బంది కొరతను అధిగమించేందుకు మూడేళ్లుగా నానుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియను ఈ మేరకు కూమి సర్కార్ చకచకా పూర్తి చేసింది. నిజానికి జూలై 30న ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే న్యాయపరమైన చిక్కుల కారణంగా ఒక రోజోఉ ఆలస్యంగా ఆగస్టు 1న విడుదలయ్యాయి. తాజాగా విడుదలైన పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో గండి నానాజి (విశాఖపట్నం) 168 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 159 మార్కులతో జి.రమ్య మాధురి (విజయనగరం) రెండో స్థానంలో, 144.5 మార్కులతో మెరుగు అచ్యుతారావు (రాజమండ్రి) మూడో స్థానంలో నిలిచారు.
తాజాగా కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు సెప్టెంబర్ 2025లో ట్రైనింగ్ ప్రారంభంకానుంది. ట్రైనింగ్ గడువు మొత్తం 9 నెలలు ఉంటుంది. అనంతరం పోస్టింగ్‌లు కల్పిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.