అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్‌ను దోషిగా తేల్చారు. ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు ప్రజ్వల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు ధర్మాసనం జీవితఖైదుతోపాటు.. రూ.5లక్షలు జరిమానా విధించింది. దీంతోపాటు రూ.7లక్షలు బాధితురాలికి ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
హసన్ లోని తన ఫాంహౌస్‌తో పాటు , నివాసంలో బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసి , వీడియో తీసినట్టు ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదయ్యింది. గత ఏడాది మే 21న అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆగస్ట్ 2024లో ప్రజ్వల్ రేవణ్ణపై చార్జ్‌షీట్ దాఖలయ్యింది.
హాసన్‌లోని గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో 2021 COVID లాక్‌డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై రెండు సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. ఫోరెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. గత 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ప్రజ్వల్ ఉన్నాడు.
ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్‌లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్‌లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్‌లో లోపాల కారణంగా కర్నాటక క హైకోర్టు ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చింది.
పని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్‌పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్‌లోని ఫామ్‌హౌజ్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్‌పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది.