ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో రక్షణ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్‌తో పాటు మరికొన్ని రక్షణ రంగ సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు శర వేగంగా అడుగులు పడుతున్నాయి. జయంతిపురం, పెద్దవరంలో ఇందుకోసం వందల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దీనివల్ల ఈ ప్రాంతానికి దేశీయంగా గుర్తింపు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అంటున్నారు. ఆ వివరాలు..
హైలైట్:
- జగ్గయ్యపేటలో డిఫెన్స్ క్లస్టర్ యూనిట్
- రెండుసార్లు పరిశీలించిన కేంద్ర బృందాలు
- జయంతిపురం, పెద్దవరంలో వందల ఎకరాల భూమి

జగ్గయ్యపేట ప్రాంతం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని అంటున్నారు. పైగా ఈ ప్రాంతానికి రైలు, విమాన, రహదారి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కొన్ని గంటల్లోని ఇక్కడకు చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ, ఏపీఐఐసీ భూములు వేల ఎకరాల్లో ఖాళీగా ఉన్నాయి. అందుకే డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు ఇది అనువైన ప్రదేశమని అంటున్నారు. ఈక్రమంలో కొన్ని రోజుల క్రితం టీడీపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌నుకలిసి.. రాష్ట్రంలో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని కోరింది.
బ్రహ్మెస్ క్షిపతి తయారీ యూనిట్ కోసం జగ్గయ్యపేట పరిధిలోని జయంతిపురంలో 800 ఎకరాలు, పెద్దవరంలో 1200 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ భూముల్లో రక్షణ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ సంస్థ ఇక్కడ ఏర్పాటైతే, జగ్గయ్యపేటకు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు వస్తుంది అంటున్నారు.
ఇదిలా ఉంచితే ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో రూ.400 కోట్లతో తోళ్ల ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు కానుంది. లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తోళ్ల పరిశ్రమతో పాటుగా, డిఫెన్స్ క్లస్టర్ కూడా ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరోవైపు జక్కంపూడి ఎకనమిక్ టౌన్షిప్ (జెట్ సిటీ)లో మొదటి టవర్‌ను రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్ని కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతంలో ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులు పెరిగి.. అభివృద్ధి జరగడమే కాక.. ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.