బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించడంతో, ఈ స్టేడియం పెద్ద ఎత్తున ఈవెంట్లకు సురక్షితం కాదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) భావిస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ జాన్ మైఖేల్ డీ’కున్హా కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఘోరమైన తొక్కిసలాట..
ఐపీఎల్ 2025 సీజన్‌లో మొదటిసారి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ జట్టు విజయోత్సవ వేడుకలను చిన్నస్వామి స్టేడియంలో జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ విషయం తెలియడంతో వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్టేడియం సామర్థ్యం కేవలం 30,000 కాగా, 3 లక్షల మందికి పైగా అభిమానులు రావడం వల్ల తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
కమిషన్ నివేదికలో కీలక విషయాలు..
ఈ ఘటనపై దర్యాప్తు చేసిన జస్టిస్ జాన్ మైఖేల్ డీ’కున్హా కమిషన్, చిన్నస్వామి స్టేడియం డిజైన్, నిర్మాణం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటానికి అనువుగా లేదని తన నివేదికలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
స్టేడియం ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు నేరుగా ఫుట్‌పాత్‌కు తెరుచుకోవడం వల్ల తొక్కిసలాట జరిగే అవకాశం ఎక్కువగా ఉందని కమిషన్ తెలిపింది.
అభిమానులు వేచి ఉండేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో, వారు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నిలబడాల్సి వస్తోంది.
అత్యవసర పరిస్థితుల్లో ఖాళీ చేయడానికి సరైన ప్రణాళికలు లేకపోవడం.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పార్కింగ్ సౌకర్యాలు సరిపోకపోవడం.
భవిష్యత్తుపై సందేహాలు..
ఈ నివేదిక తర్వాత చిన్నస్వామి స్టేడియంలో పెద్ద టోర్నమెంట్లు నిర్వహించడంపై తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు, అలాగే ఐపీఎల్ 2026 సీజన్ మ్యాచ్‌లు వేరే వేదికలకు తరలించే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఇప్పటికే మహారాజా టీ20 టోర్నమెంట్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లు, కేఎస్‌సీఏ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కమిషన్ పేర్కొంది. దీంతో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నస్వామి స్టేడియం సురక్షిత ప్రమాణాలు మెరుగుపరచకపోతే, భవిష్యత్తులో అది ఒక ప్రధాన క్రికెట్ వేదికగా ఉండటం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..