
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. గతంలో 25శాతం టారీఫ్ విధించిన ట్రంప్.. ఇప్పుడు దానిని 50శాతానికి పెంచారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే దీనికి కారణంగా చెప్పాడు. దీనిపై విదేశాంగ శాఖ స్పందించింది. ట్రంప్ టారీఫ్‌లకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా భారత్‌పై అదనపు సుంకం విధించడం చాలా దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది అన్యాయమైన, అసమంజస నిర్ణయమని స్పష్టం చేసింది. భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. ‘‘ఇటీవలి కాలంలో రష్యా నుండి భారతదేశం చేసే చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈ అంశంపై మేము ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేశాం. మా దిగుమతులు మార్కెట్ ఆధారితమైనవి. దేశ ప్రజల ఇంధన భద్రతను నిర్ధారించే లక్ష్యంతో దిగుమతులు ఉంటాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్ని అనిశ్చిత వల్లే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం. ఇతర దేశాలు సైతం వారి స్వంత ప్రయోజనాల కోసం చేస్తున్నాయి’’ అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
ట్రంప్ ప్రకటన బ్యాడ్ న్యూస్
ట్రంప్ ప్రకటన ఒక బ్యాడ్ న్యూస్ అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. 50 శాతం సుంకం అమెరికాలో చాలా మందికి భారతీయ ఉత్పత్తులను అందుబాటులో లేకుండా చేస్తుందని అభిప్రాయపడ్డారు. వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వంటి దేశాలను చూస్తే, మా కంటే సుంకాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. కానీ ప్రస్తుతానికి ట్రంప్ ప్రకటన కచ్చితంగా ఒక ఎదురుదెబ్బ అని శశిథరూర్ అన్నారు.
ఎకానమీ బ్లాక్‌మెయిల్..?
మరోవైపు ట్రంప్ టారీఫ్ ప్రకటన దేశ రాజకీయాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచింది. కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ట్రంప్ 50శాతం సుంకం అనేది ఎకానమీ బ్లాక్ మెయిల్ అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్‌ను అన్యాయమైన వాణిజ్య ఒప్పందంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ బలహీనత ప్రజలకు శాపంగా మారకూడదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏ మంత్రి కూడా దీనిపై ఎందుకు స్పందించడం లేదు? మంత్రులందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే ప్రశ్నించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…