Andhra Pradesh Rains: ఏపీలో మరో రెండురోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వచ్చే రెండురోజులు వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రాయలసీమ జిల్లాలో గురువారం పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ సూచించారు.

గురువారం రోజున అనంతపురం, సత్యసాయి జిల్లా, వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా , నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మరోవైపు రాయలసీమ జిల్లాలలో కొన్నిచోట్ల భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని సూచించింది. అలాగే పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటే వీలైనంత వరకూ బయట పనులు, కార్యక్రమాలు ఆపడం మంచిదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, పశువుల కాపర్లు, గొర్రెలు మేపేవారు సురక్షితమైన ప్రదేశాలకు, వీలైతే భవనాలలోకి వెళ్లాలని సూచిస్తున్నారు.
Hyderabad Rain: బంజారాహిల్స్‌లో రోడ్డు మధ్యలో దిగబడిపోయిన ట్యాంకర్
భారీ వర్షం కురిసే సమయంలో లోతట్టు ప్రాంతాలలో ఉండవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. వీలైనంత వరకూ వర్షం కురిసే సమయంలో ఎలక్ట్రికల్ పరికరాలను తాకకపోవటం మంచిదని చెప్తోంది. అలాగే భారీ వర్షాల వలన రహదారులు జలమయమైతే.. ఆ నీటి గుండా వాహనాలను నడపకపోవటం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు నాలుగు రోజులుగా ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, బాపట్ల, పల్నాడు ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజులుగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టగా.. వచ్చే రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది.