వైఎస్ఆర్ కడప జిల్లా.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకాలో జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ప్రచార పర్వానికి తెరపడనుండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అటు, ఎన్నికల వేడి రాజుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. రాజకీయాలు ఊపందుకున్నాయి, ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి!
హైలైట్:
- కడప జిల్లాలో రెండు జడ్సీటీసీ స్థానాలకు ఉప-ఎన్నికలు
- చివరిసారిగా పులివెందుల సీటుకు 2001లో ఎన్నిక
- అధికార టీడీపీపై వైసీపీ నేతలు ఆరోపణలు

ముఖ్యంగా పులివెందులలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. పులివెందుల మున్సిపాల్టీలో కలిసిన గ్రామాలు మినహా మిగతా ఐదు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉప-ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా లతా రెడ్డి.. వైఎస్ఆర్సీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి బరిలో ఉండగా.. 10,601 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక, ఒంటిమిట్టలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 24,606 మంది ఓటేయనున్నారు. ఈ ఉప-ఎన్నికలో పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భద్రతపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారు.
కాగా, అధికార పార్టీకి పోలీసులు, అధికారులు కొమ్ముకాస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలింగ్ బూత్‌లను మార్చేశారని, గ్రామాల్లో ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయలేదని ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఆ పార్టీకి చెందిన నేతలు విజయవాడలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, డీజీపీ కార్యాలయానికి కూడా వెళ్లి దీనిపై ఫిర్యాదు చేశారు.