తిరుపతి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్, అశ్లీల నృత్యాలకు తావు లేదన్నారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. అశ్లీల నృత్య ప్రదర్శనలపై కేసు నమోదు చేశామని.. ఏడుగురు నిర్వాహకుల్ని అరెస్టు చేశామన్నారు. తిరుపతి మహా పుణ్యక్షేత్రం.. ఇక్కడ అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిబంధనల్ని అతిక్రమిస్తే, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి నగర్ వినాయక స్వామి మండపం దగ్గర యువతులతో రికార్డింగ్ డాన్స్ తరహాలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించినట్లు సోషల్ మీడియాలో సమాచారం వచ్చిందన్నారు. వెంటనే అలిపిరి పోలీసులను కఠిన చర్యలు తీసుకున్నారని తెలిపారు.
పోలీసు నిబంధనలు అతిక్రమించి, ఉత్సవాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు ఎస్పీ. ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు వహించాలని.. వినాయక చవితి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో సాగాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదని.. గణేష్ మండపం దగ్గర జరిగే ఏదైనా ఘటనకు పూర్తిగా నిర్వాహకుల బాధ్యతని హెచ్చరించారు. వినాయక మండపాల వద్ద మరింత నిఘా ఉంచి, ఇలాంటి ఘటనలను అరికడతామన్నారు. ప్రజలందరూ వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని సూచించారు. పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు.
వరద బాధితులకు హెడ్ కానిస్టేబుల్ సాయం
మరోవైపు తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్ వరద బాధితులకు సాయం అందించారు. మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్, స్టేట్ పోలీస్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు జి.శంకర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఈరోజు రూ.20,000లు అందజేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుకు డీడీని అందజేశారు. హెడ్ కానిస్టేబుల్ శంకర్ రెడ్డిని ఎస్పీ అభినందించారు. శంకర్ రెడ్డి కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాలు చేశారు.