AP village and ward secretariat employees promotions: ఏపీలో గ్రామ. వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటుగా మరో 9 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉప సంఘం ప్రమోషన్లపై చర్చించి, అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదించనుంది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

*ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చనున్న నవంబర్ నెల.. ఏం జరగనుంది?
మరోవైపు ఇంటర్‌మీడియేటరీ పోస్టులను సృష్టించే అంశం గురించి చర్చించాలని కేబినెట్ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆయా పోస్టుల పే స్కేల్ నిర్ణయించాలని సూచించింది. ప్రమోషన్ల తర్వాత ఖాళీల భర్తీని ఎలా పూర్తి చేయాలనే పద్ధతిపైనా చర్చించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల అంశం గురించి అధ్యయనం పూర్తి చేసి.. సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించాలని ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
‘నాలాగే’.. పెమ్మసానిపై చంద్రబాబు ప్రశంసలు
*రుషికొండను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు.. మీరు కూడా సలహా ఇవ్వొచ్చు.. వివరాలివే..
ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు
మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను ఏపీ ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేసింది. ఈ ఏడాది మే 31 నాటికి ఒకేచోట ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన వారిని బదిలీ చేసింది. అయితే బదిలీలలో.. అంధులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైబడి పనిచేసిన వారు, మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న ఉద్యోగులు, కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందినవారు, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చింది. భార్యాభర్తలు గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తూ ఉంటే వారిని సమీప ప్రాంతాల్లోనే నియమించేలా చర్యలు తీసుకుంది. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులపై కీలక అడుగులు వేసింది.