విజయవాడ మెట్రోకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్ల గడువును ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మరోసారి పొడిగించింది. విజయవాడ మెట్రో టెండర్ల గడువును అక్టోబర్ 24 వరకూ అంటే మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు సంస్థలు అభ్యర్థించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు టెండర్ల గడువును పొడిగించడం ఇది రెండోసారి.

ఈ నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థల అభ్యర్థనతో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్ల గడువును మరో పది రోజులు పొడిగిస్తూ ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24వ తేదీ వరకూ టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. విజయవాడతో పాటుగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలిదశలో 38 కిలోమీటర్ల మేరకు నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశలో 1ఏ కింద గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ ఓ కారిడార్ నిర్మించనున్నారు. అలాగే 1బీ కింద పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మరో మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది.
దసరా పండుగ ‘రిటర్న్ గిఫ్ట్’.. కిక్కిరిసిన మెట్రో.. భారీగా ట్రాఫిక్ జామ్‌లు..
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 1 కింద 38.40 కి.మీ. మేర మెట్రో నిర్మాణానికి రూ.11,009 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. భూసేకరణ కోసం రూ.1,152 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే భరించనుంది. ఇక విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ 27.75 కి.మీ. మేరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల ఫేజ్ 1 పనులను మూడేళ్లలో పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం సీఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు నిధులు ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రపంచబ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, జైకా వంటి విదేశీ బ్యాంకుల నుంచి రుణాలను కూడా సమీకరించనున్నారు.