Four Days Toll Fees Exemption For Srisailam Devotees: శ్రీశైలం మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గత రెండు, మూడు రోజులుగా శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. మరో రెండు రోజుల్లో శివరాత్రి ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల పాటూ శ్రీశైలం వచ్చే వాహనాలకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. టోల్‌గేట్ల దగ్గర ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.
హైలైట్:
- శ్రీశైలం వచ్చే భక్తులకు తీపికబురు
- నాలుగు రోజులు టోల్ ఫీజు లేదు
- ఉచితంగా లడ్డూలు పంపిణీ

శ్రీశైలం వచ్చే భక్తుల కోసం నంద్యాల-శ్రీశైలం మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఏపీఎస్‌ఆర్టీసీ 1,800, తెలంగాణ నుంచి 1,000, ఇతర ప్రాంతాల నుంచి కలిపి 3 వేల బస్సులు అందుబాటులో ఉన్నాయి. అంతకముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిలు స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహాశివుడి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డులో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ వి హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ‘మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఘాట్ రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు, హైవే పెట్రోలింగ్ వాహనాలు, టోయింగ్ వెహికల్స్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఘాట్ రోడ్డులో అనుభవం ఉన్న డ్రైవర్ల వాహనం నడపాలి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించరాదు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయబడింది.
రద్దీ సమయాల్లో అదనపు పోలీస్ సిబ్బందిని మోహరించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి, వాటికి నిర్దిష్ట సమయాలు కేటాయించబడతాయి. ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు విధుల్లో ఉంటాయి’ అని తెలిపారు.
‘ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఘాట్ రోడ్డులో అతి వేగం, ఓవర్‌టేకింగ్ పూర్తిగా నివారించాలి. అనవసరంగా రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదు. నైపుణ్యం కలిగిన డ్రైవర్లతోనే ప్రయాణం చేయాలి. వాహనాల బ్రేకులు, టైర్లు, ఇంజిన్ పరిస్థితి ముందుగా తనిఖీ చేసుకోవాలి. పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలను గౌరవించి సహకరించాలి. ప్రయాణికులు, భక్తులకు ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేశాము. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని మహాశివరాత్రి వేడుకలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశాము’ అని ఎస్పీ తెలిపారు.


