
వివాహ సీజన్ కు సరిగ్గా సరిపోయేలా ఉన్న ఆమె లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె కళ్లు మాట్లాడతాయి.. ఆమె చిరునవ్వు కోటి కాంతులను వెదజల్లుతుంది. మూడు దశాబ్దాలుగా భారతీయ వెండితెరపై తన అసమానమైన నటనతో, నృత్యంతో ప్రేక్షకులను మైమరపిస్తున్న ఆ అగ్ర నటి, ఇప్పుడు ఒక అద్భుతమైన చీర కట్టులో దర్శనమిచ్చింది. రాజదర్బారులో కూర్చున్న మహారాణిలా హుందాగా కనిపిస్తూ, కనుచూపు తిప్పుకోనివ్వనంత అందంతో అలరిస్తోంది. జనవరి 31న ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ సీనియర్ బ్యూటీ మరెవరో కాదు.. మాధురి దీక్షిత్.
బాటిల్ గ్రీన్ లుక్..
వివాహ వేడుకల సీజన్ కు తగినట్లుగా మాధురి దీక్షిత్ ఆరు గజాల బాటిల్ గ్రీన్ షేడ్ సిల్క్ చీరను ఎంచుకున్నారు. ఆ పచ్చదనం ఆమెకు ఒక రాచరికపు రూపాన్ని అందించింది. చీర అంచుల వెంబడి ఉన్న జర్దోజీ ఎంబ్రాయిడరీ ఆ చీర విలాసాన్ని మరింత రెట్టింపు చేసింది. దానికి సరిపోయేలా అదే రంగులో ఉన్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి, లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ కు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సోఫాలో స్టైలిష్ గా కూర్చుని ఉన్న తీరు, జాలువారుతున్న పల్లు చూస్తుంటే సాక్షాత్తు ఒక మహారాణిని చూస్తున్న అనుభూతి కలుగుతోంది.
ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే..
ఈ అద్భుతమైన చీరను ప్రముఖ డిజైనర్ జయంతి రెడ్డి లేబుల్ నుండి తీసుకున్నారు. దీని ధర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ విలాసవంతమైన చీర విలువ అక్షరాలా రూ. 1,39,900. అంటే దాదాపు లక్షా నలభై వేల రూపాయల వరకు పలుకుతోంది. ఆ చీరకు తగ్గట్టుగా మాధురి ఎంచుకున్న మేకప్, హెయిర్ స్టైల్ ఆమె లుక్ ను మరింత గ్రాండ్ గా మార్చేశాయి. మాధురి దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. 1965 నాటి క్లాసిక్ సినిమా ‘గైడ్’ లోని లతా మంగేష్కర్ పాడిన “పియా తోసే నైనా లాగే రే” అనే పాటను క్యాప్షన్ గా ఇచ్చారు. ఆ పాటలోని భావానికి తగ్గట్టే ఆమె కళ్లలో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తోంది. ఐదు పదుల వయసులో కూడా తన ఫిజిక్ ను, గ్లామర్ ను కాపాడుకుంటూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఏ రంగు చీర కట్టినా మాధురి అందం రెట్టింపు అవుతుంది అనడానికి ఈ లేటెస్ట్ ఫోటోలే నిదర్శనం. వివాహ వేడుకల్లో గ్రాండ్ గా కనిపించాలనుకునే వారికి మాధురి దీక్షిత్ ఎంచుకున్న ఈ బాటిల్ గ్రీన్ సిల్క్ చీర ఒక మంచి స్ఫూర్తి అని చెప్పాలి.
