తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. గ్రహణం విడిచిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే అన్న ప్రసాద వితరణ కూడా తిరిగి ప్రారంభమైంది. లడ్డూ కౌంటర్లు కూడా తిరిగి అందుబాటులోకి తెచ్చారు.

మరోవైపు చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సు మూసివేశారు. గ్రహణం విడిచిన తర్వాత రాత్రి 7.30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అనంతరం.. రాత్రి 8.30 గంటల నుంచి శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అలాగే లడ్డు కౌంటర్లు కూడా తిరిగి తెరిచారు.
ఘనంగా కుమార ధార తీర్థ ముక్కోటి
మరోవైపు తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటిని మంగళవారం రోజున వైభవంగా నిర్వహించారు. అయితే చంద్ర గ్రహణం నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను కుమార ధార తీర్థానికి అనుమతించారు. భక్తుల కోసం టీటీడీ అన్న ప్రసాద విభాగ సిబ్బంది.. పాపవినాశనం డ్యామ్ వద్ద అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
పలమనేరు గోశాలను పరిశీలించిన జేఈవో
మరోవైపు టీటీడీ జేఈవో శరత్ పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలను పరిశీలించారు. గోశాలలో ఉన్న పశువులకు సమయానికి మేత, త్రాగునీరు అందించాలని.. అవసరమైన వైద్య సేవలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పలమనేరులో 450 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ గోశాల ఉంది. ఇందులో ప్రస్తుతం 542 పశువులు ఉన్నాయి. మరోవైపు గోశాలలోని పశువులకు 13 ఎకరాల్లో పచ్చిమేత అందుబాటులో ఉందని జేఈవో శరత్ తెలిపారు. మరింత విస్తీర్ణంలో పచ్చి గడ్డి సాగు చేయాలని సూచించారు.
పశువుల దాణా, షెడ్ల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, పరిశుభ్రత, మందుల వివరాలను రోజువారీగా నమోదు చేసేలా..ప్రతి షెడ్‌లోనూ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పశువులకు నీడ కల్పించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని.. బెంగుళూరులోని శ్రీ శ్రీ గోశాలను సందర్శించి, అక్కడ అమలయ్యే మెరుగైన పద్ధతులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని టీటీడీ జేఈవో శరత్ సూచించారు.


