ఇరాన్. ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పలువురు తెలుగు ప్రజలు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. తమను సొంతూరికి చేర్చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన కుమారి అనే మహిళ కువైట్‌లో చిక్కుకుపోయారు. తమ ప్రాంతంలో బాంబులు పడుతున్నాయని.. ఇంటి దగ్గర తన పిల్లలు భయపడుతున్నారని, తనను ఇంటికి చేర్చాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కుమారి. బాంబులు పడుతున్న వీడియోను తీసి, వేడుకుంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయటంతో.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

” చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కారం. నా పేరు దాకే కుమారి. మాది పిఠాపురం ప్రాంతం. నాలుగు నెలల క్రితం కువైట్ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏ మాత్రం బాగోలేదు. బాంబు దాడులతో భయం భయంగా బతకాల్సి వస్తోంది. చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. మేము ఇక్కడే చిక్కుకుపోయాం. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. మా ఇంటి దగ్గర పిల్లలు చాలా భయపడుతున్నారు సర్. ప్లీజ్ నన్ను మా ఇంటికి చేర్చండి సర్ ప్లీజ్.. చాలా భయంగా ఉంది సర్, ఎలాగైనా ఇంటికి చేర్చండి” అంటూ కుమారి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. దీనికి తోడుగా తమ ప్రాంతంలో బాంబులు పడుతున్న వీడియోను తీసి తన పోస్టుకు జత చేశారు కుమారి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం స్పందించి కుమారి కుటుంబాన్ని కువైట్ నుంచి సొంతూరు చేర్చాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.
మరోవైపు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఏపీ ఎన్ఆర్టీఎస్ హెల్ప్‌లైన్ నంబర్ 0863-2340678 అందుబాటులో ఉంచింది. అలాగే +91 85000 27678 వాట్సాప్ నంబర్, helpline@apnrts.com ఈమెయిల్ అందుబాటులో ఉంచింది. గల్ఫ్ దేశాలలోని తెలుగు ప్రజలు స్థానికంగా ఉండే ఇండియన్ ఎంబసీ సేవలను, ఏపీ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. తెలుగు ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది.


